NEET 2024 Exams: నీట్ పేపర్ లీక్ లో బిహార్ ముఠా !
నీట్ పేపర్ లీక్ లో బిహార్ ముఠా !
NEET 2024 Exams: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశ పరీక్ష 2024’లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు వచ్చిన వార్తలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తోసిపుచ్చింది. అయితే ఇది జరిగి 48 గంటలు తిరగకుముందే…. బిహార్ ఆర్థిక నేర విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ పేపర్ ను లీక్ చేసిన ముఠా… రూ.30 లక్షల చొప్పున చాలామందికి అమ్మినట్లు ప్రాధమిక విచారణలో బయటపడింది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం నీట్ అక్రమాలు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
NEET 2024 Exams..
నీట్(NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజినీర్ కూడా ఉన్నాడు. ‘‘మే 4వ తేదీన మాకు నీట్ ప్రశ్నపత్రం లభించింది. ఈ పేపర్ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి రూ.30లక్షల నుంచి రూ.32 లక్షల చొప్పున తీసుకున్నాం. ఆ తర్వాత వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నపత్రం చూపించాం’’ అని మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్‌లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా… మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
Also Read : Delhi Water Crisis: ఢిల్లీలో నీటి సంక్షోభం ! పైపులైన్లకు పోలీసు పహారా ?