BJP: ఏపీ, తెలంగాణా బీజేపీ అధ్యక్షుల నియామకం

ఏపీ, తెలంగాణా బీజేపీ అధ్యక్షుల నియామకం

BJP : ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్‌కు తెరపడింది. తెలంగాణా రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరు బీజేపీ (BJP) అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం హైకమాండ్‌ నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే… అందరి సమ్మతితో ఎన్నిక జరిపే విధంగా హైకమాండ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

BJP – నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే

బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌

ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చింది. అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన… గతంలో శాసన మండలిలో బీజేపీ (BJP) ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. మాధవ్‌… బీజేపీ సీనియర్‌ నేత, దివంగత చలపతిరావు కుమారుడు. ఆయన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అధ్యక్ష పదవికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాధవ్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్‌ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీలో కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి నియామకంపై కాషాయ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి రాజాసింగ్‌ విమర్శలు గుప్పించారు. రాజాసింగ్‌ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలి. అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Also Read : MLA Raja Singh: బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!