CM Siddaramaiah: ‘వ్యాక్సిన్’ ఆరోపణలపై సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలి – బీజేపీ
‘వ్యాక్సిన్’ ఆరోపణలపై సిద్ధరామయ్య క్షమాపణ చెప్పాలి - బీజేపీ
CM Siddaramaiah : కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న మరణాలకు కొవిడ్ టీకాలే కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ స్పష్టం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ (BJP) డిమాండ్ చేసింది. ఇటీవల హసన్ జిల్లాలో 20 మంది గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారు. దీనికి కొవిడ్-19 వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరణాలకు గల కారణాలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రత్యేక నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.
CM Siddaramaiah – BJP Demands
వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన నిపుణుల బృందం ఆకస్మిక మరణాల వెనుక పలు కారణాలు ఉన్నట్లు తేల్చింది. జన్యు, మానసిక, పర్యావరణ సంబంధిత కారణాలతో వారిలో గుండె సమస్య తలెత్తినట్లు పేర్కొంది. మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్ కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. హుబ్బళిలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై జోషి మాట్లాడారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), దిల్లీ ఎయిమ్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ కొవిడ్-19 వ్యాక్సిన్‌కు గుండె సమస్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారన్న అక్కసుతోనే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
‘‘కొవిడ్ వ్యాప్తికి మోదీ అడ్డు కట్టవేయలేరని కాంగ్రెస్ భావించింది. ప్రజలంతా ఆయనకు ఎదురు తిరుగుతారని ఆ పార్టీ నేతలు వాళ్లనుకున్నారు. కానీ, వారి అంచనాలు ఫలించలేదు. కరోనాను సమర్థంగా అడ్డుకున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా మోదీకి ప్రశంసలు వెల్లువెత్తాయి. అది ఓర్చుకోలేకే… కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారు. గుండె పోటుకు, కొవిడ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీ, ఎయిమ్స్ తదితర సంస్థలు స్పష్టం చేసిన నేపథ్యంలో జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన నిపుణులతో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాళ్లు కూడా అదే విషయాన్ని మరోసారి చెప్పారు. మరి సిద్ధరామయ్య క్షమాపణలు చెబుతారా? ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని జోషి అన్నారు. మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సీఎన్. అశ్వత్ నారాయణ్ కూడా సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత్ లో తయారైన వ్యాక్సిన్లను అప్రతిష్ఠపాలు చేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Also Read : Government of India: ఆ మీడియా సంస్థల ‘ఎక్స్’ ఖాతాల నిలిపివేతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
