Kanhaiya Kumar : రాహుల్ గాంధీ అంటే బీజేపీకి భయం
కన్హయ్య కుమార్ షాకింగ్ కామెంట్స్
Kanhaiya Kumar : ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఇప్పటికే తన యాత్రను 100 రోజులు పూర్తి చేసుకున్నారు. మొత్తం 150 రోజులకు పైగా 3,578 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు కన్హయ్య కుమార్(Kanhaiya Kumar) శనివారం మాట్లాడారు. రాహుల్ గాంధీ యాత్రను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. వాళ్లు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.
కానీ తమ నాయకుడు ద్వేషం కాదు కావాల్సింది దేశానికి ప్రేమ కావాలని కోరుతున్నారు. అందుకే ఓ వైపు చలి వణికిస్తున్నా దేశం కోసం , ఈ 135 కోట్ల ప్రజలు కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారని అన్నారు. వాళ్లు రాహుల్ గాంధీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు కన్హయ్య కుమార్(Kanhaiya Kumar).
వాళ్లు మాటలతో దాడులు చేస్తున్నారు. రేపొద్దున తమ పీఠాలు కదులుతాయని అనుకున్నప్పుడు భౌతికంగా కూడా దాడులు చేసేందుకు సిద్దంగా ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. కానీ రాహుల్ గాంధీ అన్నింటికీ తెగించే ఇవాళ భారత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు కన్హయ్య కుమార్. ఈ దేశానికి కావాల్సింది మతం కాదు మానవత్వం కావాలని పిలుపునిచ్చారు ఈ యువ నాయకుడు.
Also Read : ఫరూక్ అబ్దుల్లా నోట ముఖేష్ పాట