భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తాను చేసిన ఆరోపణలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. సోమవారం రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. సర్వే నెంబర్ 65 మినహా మంత్రి తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోయారని స్పష్టం చేశారు.
గిరిజన బిడ్డను అడ్డం పెట్టుకుని ఎన్ని సబ్సిడీలు పొందారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మంత్రికి లేదా అని ప్రశ్నించారు. పదవిని అడ్డం పెట్టుకుని నీతులు వల్లించినంత మాత్రాన అవి నిజాలు అయి పోవన్నారు రఘునందన్ రావు. తాను తెలివిమంతుడినని, తనకు తప్ప వేరే వాళ్లకు ఏమీ తెలియదనే భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు నిరంజన్ రెడ్డి ఎన్ని భూములను కొనుగోలు చేశారో, ఎవరి పేరు మీదకు మళ్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే. దత్త పుత్రుడి పేరుతో అందినంత మేర కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. తాను కొన్న భూముల వివరాలు రికార్డుల్లో చూపించ లేదని నిలదీశారు. నిరంజన్ రెడ్డి పాత నెంబర్ నుంచి రెగ్యులర్ గా చైనాకు కాల్స్ వెళ్లాయని వాటి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. ఈ మేరకు మంత్రి అక్రమాలు, భూ కబ్జాల వ్యవహారంపై తాను ఈడీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.