BJP MP Ram Chander Jangra: పహాల్గా ఉగ్రదాడి బాధితులపై బీజేపీ ఎంపీ అనైతిక వ్యాఖ్యలు

పహాల్గా ఉగ్రదాడి బాధితులపై బీజేపీ ఎంపీ అనైతిక వ్యాఖ్యలు

 

 

పహాల్గాంలోని పర్యాటకుపై ఉగ్రమూకలు చేసిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరపడం యావత్ ప్రపంచాన్ని దిగ్భాంత్రికి గురిచేసింది. దీనితో పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టి… పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ తో పాటు తదనంతరం జరిగిన పరిణామాలను దేశ ప్రజలకు వివరిస్తూ… కీలకంగా వ్యవహరించిన కల్నర్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పై పలువురు బీజేపీ నాయకులు నోరు పారేసుకున్నారు. దీనితో వారు బీజేపీ అధిష్టానంతో పాటు కోర్టుల నుండి కూడా మొట్టికాయలు తిన్నారు.

అయితే తాజాగా పహల్గాం ఉగ్ర దాడి బాధితులపై బీజేపీ నేత, ఎంపీ రాంచందర్ జంగ్రా నోరు పారేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్‌ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

బీజేపీ ఎంపీ రాంచందర్‌ జంగ్రా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగ్నివీరుల్లాగా వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’ అంటూ కామెంట్స్‌ చేశారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్‌ నేతలు దీపీందర్‌సింగ్‌ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు మండిపడ్డారు.

 

ఇదిలా ఉండగా… ఇటీవలే భారత సైనికాధికారిణి కర్నల్‌ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విజయ్‌ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనితో, ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్‌ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. అనంతరం, జరిగిన పరిణామాల తర్వాత సదరు మంత్రి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అది ‘భాషా పరమైన తప్పిదమే’ తప్ప ఏ మతాన్నీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్‌ ఆర్మీకి, సోదరి కర్నల్‌ సోఫియా ఖురేషీకి, యావత్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!