Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు
Bhatti Vikramarka : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల ఆత్మహత్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. బేషరతుగా మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని… 25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తానని హెచ్చరించారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని బీజేపీ చీఫ్ తరపు న్యాయవాది అటాచ్ చేశారు.
నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుపైన సంచలన ఆరోపణలు చేశారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులపై మాట్లాడుతూ… హెచ్‌సీయూలో విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రయత్నించారని ఆరోపించారు. బీజేపీ అధిష్ఠానం తెలంగాణ నూతన అధ్యక్షుడిగా రాంచందర్‌రావును ఎంపిక చేయడాన్ని తప్పుపడుతూ… రోహిత్ వేముల హత్యకు కారకులైనవారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాంచందర్‌రావు నియామకం ఎంత మాత్రం సమంజసం కాదని కామెంట్ చేశారు. దీనికి కౌంటర్‌గా ఈ రోజు బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు పంపించారు.
Mallu Bhatti Vikramarka – తెలంగాణకు కేంద్రం అన్యాయం చేయదు – బండి సంజయ్
తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేయదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఉద్ఘాటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్నిసీఎం రేవంత్‌రెడ్డి గట్టిగా వినిపించాలని కోరారు. కేంద్రానికి రెండు రాష్ట్రాలు సమానమేనని నొక్కిచెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వివరించాలని సూచించారు. మంగళవారం కరీంనర్‌లో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
రేవంత్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో బీసీలు 51 శాతం… కాంగ్రెస్ సర్వేలో మాత్రం 46 శాతమా అని ప్రశ్నించారు. బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని నిలదీశారు. బీసీలకు మీరిచ్చేది కేవలం ఐదు శాతమేనని చెప్పుకొచ్చారు. బీసీ ఆర్డినెన్స్‌ను తాము వ్యతిరేకించమని స్పష్టం చేశారు. బీసీల్లో ముస్లింలను కలిపితే ఆ ఆర్డినెన్స్‌ను మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు. బీసీలను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తోందని.. ఈ మోసంపై బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీసీల్లో ముస్లింలను కలిపితే… కేంద్రప్రభుత్వం ఆమోదం తెలపదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
Also Read : Muralidhar Rao: నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అరెస్ట్
