Blue Flag Beach: రుషికొండ బీచ్‌ కి బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు చేసిన డెన్మార్క్‌ సంస్థ !

రుషికొండ బీచ్‌ కి బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు చేసిన డెన్మార్క్‌ సంస్థ !

Blue Flag Beach : ఆంధ్రప్రదేశ్ లో బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌ గా విశాఖలోని రుషికొండకు నిలిచింది. దీనితో రుషికొండ బీచ్ కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బ్లూ ఫాగ్(Blue Flag Beach) గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ లో బోటింగ్, సర్పింగ్ వంటి విన్యాసాలు కూడా చేస్తుంటారు. అంతటి ప్రాధాన్యమున్న ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇప్పుడు తాత్కాలికంగా రద్దు చేస్తూ డెన్మార్క్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇదే సమాచారాన్ని పర్యాటక శాఖ అధికారులకు తెలియజేయడంతో… రుషికొండ తీరంలోని జెండాలను పర్యాటకశాఖ అధికారులు శనివారం కిందకు దించేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్‌ బీచ్‌ గా 2020లో ధ్రువీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్‌ కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ అందిస్తుంది. అయితే కొంతకాలంగా బీచ్‌ లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటుచేసుకున్నాయి. టాయిలెట్స్, దుస్తులు మార్చుకునే గదులు నిర్వహణ తీసుకట్టుగా మారాయి. బీచ్ లో పారిశుద్య నిర్వహణ అధ్వానంగా ఉన్న చిత్రాలతో కొందరు డెన్మార్క్‌ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డెన్మార్క్ సంస్థ బ్లూ ఫ్లాగ్(Blue Flag Beach) గుర్తింపును రద్దు చేసినట్లు స్థానిక పర్యాటక శాఖ అధికారులకు సమాచారం అందించింది.

Blue Flag Beach – ప్రైవేటు ఏజెన్సీ నిర్లక్ష్యమే బ్లూ ఫ్లాగ్ రద్దుకు కారణమా ?

గత వైసీపీ ప్రభుత్వంలో రుషికొండ బీచ్‌ నిర్వహణ వివాదాస్పదమైంది. 2018లో టీడీపీ ప్రభుత్వంలో రూ.7 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో తీరంలో మౌలిక వసతులు కల్పించారు. ఆ పనులు చేసిన సంస్థే కొద్దిరోజులు వాటి నిర్వహణను చేపట్టింది. తర్వాత చాలాకాలం ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ బీచ్‌ ను నిర్వహించింది. రెండేళ్ల క్రితం ఈ నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే సదరు ప్రైవేటు సంస్థ తగిన సిబ్బందిని నియమించక ప్రమాణాల్ని గాలికొదిలేసింది. గత ఏడాది నవంబరుతో ఆ సంస్థ నిర్వహణ గడువు ముగిసినప్పటికీ కొత్త సంస్థకు నిర్వహణ బాధ్యతను అప్పగించకపోవడం కూడా గుర్తింపు రద్దుకు ఒక కారణంగా కనిపిస్తోంది.

Also Read : Kinjarapu Rammohan Naidu: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చురకలు !

Leave A Reply

Your Email Id will not be published!