Bomb Threat : పహాల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఏదో ఒక చోట బాంబు బెదిరింపులు వస్తున్నాయి. దీనితో అప్రమత్తమవుతున్న భద్రతా బలగాలు హుటాహుటీన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనంతరం ఆ బెదిరింపులు ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఆగ్రాలో గల తాజ్ మహల్(Taj Mahal) కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌డీఎక్స్‌తో తాజ్‌మహల్‌ను పేల్చివేస్తామని కేరళ నుంచి ఈ మెయిల్ అందిన దరిమిలా సంబంధిత అధికారులు తాజ్ మహల్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా సంస్థలు అప్రమత్తమై, నిఘాను మరింత ముమ్మరం చేశాయి. దీనితో తాజ్ మహల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Bomb Threat to Taj Mahal
బాంబు బెదిరింపు ఈ ఇమెయిల్ అందిన వెంటనే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్), తాజ్ భద్రతా పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, టూరిజం పోలీసులు, భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ)అధికారులు దాదాపు మూడు గంటల పాటు తాజ్ మహల్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. అయితే అనుమానాస్పద వస్తువులు ఏవీ కనిపించలేదు. తాజ్ మహల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, ఢిల్లీ పోలీసులకు గుర్తు తెలియని మెయిల్ ఐడి నుండి బెదిరింపు మెయిల్ అందింది. తాజ్ మహల్‌ను ఆర్‌డీఎక్స్‌తో పేల్చివేస్తామని దానిలో హెచ్చరించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈమెయిల్ నకిలీదని తేలింది. దీనిపై సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
తాజ్‌మహల్ రక్షణకు యాంటీడ్రోన్ వ్యవస్థ
తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని వరుస బెదిరింపుల నేపథ్యంలో… ఈ అద్భుత నిర్మాణం భద్రతపై కేంద్రం దృష్టి సారించింది. తాజ్ మహల్ కాంప్లెక్స్ లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీనితో తాజ్ మహల్(Taj Mahal) భద్రత మరింత హైటెక్ గా మారనుంది. ఈ స్మారక చిహ్నం ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్), ఉత్తరప్రదేశ్ పోలీసుల రక్షణలో ఉంది. ఇక్కడ త్వరలో అధునాతన డ్రోన్ తటస్థీకరణ సాంకేతికత రూపంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నామని తాజ్ సెక్యూరిటీ ఏసీపీ సయ్యద్ అరిబ్ అహ్మద్ తెలిపారు.
ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేయగలుగుతుంది. ప్రధాన గోపురంపైన 200 మీటర్ల వ్యాసార్థంలో ప్రభావవంతంగా పనిచేయనుంది. ఆ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే వెంటనే గుర్తించి దాని సిగ్నల్‌ను జామ్ చేస్తుంది. దీనితో డ్రోన్ పనిచేయదు. దీనిని ‘సాఫ్ట్ కిల్’ అని పిలుస్తారు. ఈ వ్యవస్థను నిర్వహించడానికి పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, అంకితమైన ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని అరిబ్ అహ్మద్ తెలిపారు.
కొద్ది రోజుల్లో వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుందని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేయడం తెలిసిందే. అయితే.. ఆ తరువాత పాక్ వరుసగా ఫిరంగి, క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపైనా దాడికి యత్నించింది. వీటన్నింటి భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలలో డ్రోన్ నిరోధక చర్యల అవసరాన్ని గుర్తించిన కేంద్రం.. తాజ్‌మహల్ భద్రతపై దృష్టి సారించింది.
Also Read : Covid-19 Updates : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా విజృంభణ.. మహారాష్ట్రలో 43 కొత్త కేసులు
