Bomb Threat: తిరుపతిలో బాంబు కలకలం ! కలెక్టరేట్ కు బెదిరింపు మెయిల్ !
తిరుపతిలో బాంబు కలకలం ! కలెక్టరేట్ కు బెదిరింపు మెయిల్ !
Bomb Threat : తిరుపతి కలెక్టరేట్ లో బాంబు కలకలం రేగింది. తిరుపతి(Tirupati) కలెక్టరేట్ లో బాంబ్ పెట్టామంటూ… గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ ఐడీ నుండి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీనితో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. శుక్రవారం సాయంత్రం పోలీసులకు మెయిల్ రాగా, తిరుపతి కలెక్టరేట్ ను బాంబ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కలెక్టరేట్‌లో అన్ని విభాగాల సిబ్బందిని బయటకు పంపించిన పోలీసులు… తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో బాంబు లేదని తేల్చడంతో కార్యాలయం సిబ్బందితో పాటు పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.
Bomb Threats to Tirupati
తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో కూడా కార్పొరేట్ హోటళ్లతో పాటు పలు ఆలయాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల(ఫిబ్రవరి)లో ఎస్వీ అగ్రికల్చరల్ కళాశాలలో హ్యూమన్ ఐఈడీ బాంబు పెట్టామంటూ ఆగంతుకుల నుంచి కళాశాల అధికారులకు ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు, అధ్యాపకులు ఉలిక్కిపడ్డారు. వెంటనే కళాశాల అధికారులు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. గతంలో పలు మార్లు కళాశాలకు బాంబు బెదురింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమై ఫేక్ సమాచారంగా తేల్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనుమడు, లోకేశ్ తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చంద్రబాబు… తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ఒక్కరోజు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేసారు. ఈ నేపథ్యంలో తిరుపతికి బాంబ్ బెదిరింపు రావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Also Read : Harish Rao: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ నేత హరీష్‌రావు భేటీ