Botcha Satyanarayana: స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు త్వరలోనే ఉద్యమం – మాజీ మంత్రి బొత్స 

స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు త్వరలోనే ఉద్యమం - మాజీ మంత్రి బొత్స 

Botcha Satyanarayana : ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనేదే వైసీపీ విధానమని… స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు త్వరలోనే ఉద్యమించనున్నట్లు శాసనమండలి ప్రతిపక్షనేత, వైసీపీ (YSRCP) సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) తెలిపారు. విజయనగరంలోని తన సోదరుడు బొత్స అప్పలనరసయ్య నివాశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బొత్స మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 16 సార్లు ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడంపై ఎందుకు కేంద్రాన్ని ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఏకంగా 32 డిపార్ట్‌మెంట్లు ప్రైవేటీకరిస్తుంటే… కూటమి ప్రభుత్వం మౌనంగా చూస్తూ ఉండటం దారణమని మండిపడ్డారు. కలిసి వచ్చే వారందరినీ సమన్వయం చేసుకుంటూ, విశాఖ ఉక్కు కోసం పోరాటానికి వైయస్ఆర్‌సీపీ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.

Botcha Satyanarayana Key Comments on Steel Plant

విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) లో 32 డిపార్ట్‌మెంట్‌లను ప్రైవేటీకరిస్తుంటే, దానిపై కూటమి ప్రభుత్వం ఎందుకు ప్రేక్షకపాత్ర పోషిస్తోంది ? పైగా వైసీపీపై బుదరచల్లుతున్నారు. మేం విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఎటువంటి ఉద్యమానికైనా సిద్దంగా ఉన్నాం. ఇది మా పార్టీ విధానం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు వైయస్ జగన్ దీనినే చాలా స్పష్టంగా చెప్పారు. కూటమి అభ్యర్ధులను గెలిపిస్తే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని పదేపదే చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు ఎం మాట్లాడారు? స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంటూ మాయమాటలు చెప్పారు.

రూ.14 వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడే మోసం జరుగుతోందని మేం చాలా స్పష్టంగా చెప్పాం. స్టీల్ ప్లాంట్‌ను (Steel Plant) ప్రైవేటీకరించము అని ప్రకటించాలని డిమాండ్ చేశాం. రెండు సార్లు విశాఖకు ప్రధాని వచ్చినా కూడా ఎందుకు సీఎం చంద్రబాబు ఆయనతో ఈ మేరకు ప్రకటన చేయించలేదు? సీఎం అయిన తరువాత చంద్రబాబు దాదాపు పదహారు సార్లు ఢిల్లీకి వెళ్ళారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రంతో ఏం మాట్లాడారు? ప్రైవేటుపరంపై వెనక్కి వెళ్ళేలా ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మాపైన నిందలు వేస్తున్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనేదే మా స్టాండ్. దీనిపై త్వరలోనే ఎలా ఉద్యమాన్ని ప్రారంభిస్తామో ప్రకటిస్తాం. కలిసి వచ్చే అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెడతాం.

Botcha Satyanarayana – రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (NDA Govt) పాలన అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వంపై సంతృప్తితో లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అరకొరగా పథకాలను మొదలుపెట్టి, మాటలతోనే ఈ ప్రభుత్వం కాలం గడుపుతోంది. తల్లికి వందనం పథకం కింద ఈ రోజుకు అనేక మందికి కేంద్రం నుంచి డబ్బు రాలేదు, వచ్చిన తరువాత మీ ఖాతాలకు జమ చేస్తామనే చెబుతున్నారు. దాదాపు ఏడెనిమిది లక్షల మంది మహిళలకు ఇలా మొండిచేయి చూపించారు. గత ఏడాది పూర్తిగా ఈ పథకాన్ని ఎత్తేశారు. ఇక అన్నదాత సుఖీభవ అమలు కూడా ఇదే విధంగా ఉంది. విజయనగరం జిల్లాలో 50 వేల మంది వరకు రైతులకు ఈ పథకాన్ని ఎగ్గొట్టారు.

అన్ని అర్హతలు ఉన్నా కూడా తమకు ఎందుకు లబ్ధి చేకూరడం లేదంటే ఏదో ఒక సాంకేతిక కారణాన్ని చూపుతున్నారు. చివరికి వితంతు పెన్షన్‌లను కూడా ప్రహాసనంగా మార్చేవారు. ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు అవుతున్నా, భర్త లేని వితంతువులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం లేదు. ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఎనిమిది వారాలుగా వేతనాలు కూడా చెల్లించకుండా బకాయిపెట్టారు. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో పెద్ద ఎత్తున పెన్షన్లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మంత్రులు, ఎమ్మెల్యేలపైన ఆరోపణలు, మహిళలపై దౌర్జన్యాలు, బాలికలపై దాడులు, విశాఖలో డగ్ర్స్ మాఫియా. శాంతిభద్రతలు ఎక్కడా కనిపించడం లేదు. అయిదేళ్ళ వైసీపీ (YSRCP) పాలన… ఈ పద్నాలుగు నెలల కూటమి పాలనలో జరిగిన నేరాలను బయటపెట్టి, చర్చకు వస్తారా ? ఎవరి హయాంలో దారుణాలు జరుగుతున్నాయో ప్రజలకు చూపించగలరా? ప్రభుత్వ శాఖలపై పాలకులకు పట్టు లేకుండా పోయింది. పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాలికి వదిలేశారు. ఇదేనా పరిపాలనా? దీనిని మంచి పాలన అని చెప్పుకుంటున్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాలన్న కనీస బాధ్యత కూడా లేదు. ఎందుకు రాష్ట్రంలో ఎరువుల కొరత వచ్చింది? కావాల్సిన ఎరువులపై ముందుచూపు ఉండవద్దా? ఎరువు కొరత ఉంటే, కేంద్రంతో మాట్లాడి తెచ్చుకోవాల్సిన అసవరం లేదా? గత అయిదేళ్ళలో ఆర్బీకేల ద్వారా రైతులకు కొరత అనేదే తెలియకుండా ఎరువులను అందించాం. నేడు బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్తితిని సృష్టించారు. యూరియా బస్తా కావాలంటే, దానికి తోడుగా ఒక కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సిందేనన్న వ్యాపారుల డిమాండ్‌కు రైతులు బలైపోతున్నారు.

మాట్లాడితే సీఎం చంద్రబాబు పీ4 అంటూ కొత్తగా చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో ఇంత మంది పేదలను తీసుకున్నాం, వారిని పీ4 కింద బాగు చేస్తున్నాం, దీనికి ఈ విధానాన్ని అనుసరిస్తున్నామని ధైర్యంగా చెప్పగలరా? కేవలం ప్రచారం కోసం పీ4 అని ప్రచారం చేసుకుంటున్నారు. మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న పధకాన్ని ఎగ్గొట్టేందుకే పీ4ని ముందు పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ చేసిన హంగామాలో కూడా మోసం ఉంది. కేవలం అయిదు కేటగిరి బస్సుల్లోనే ఉచితం అంటూ ఆంక్షలు ఎలా పెడతారు? మిగిలిన కేటగిరిల్లో ఎందుకు అనుమతించడం లేదు? ఎన్నికల్లో హామీ ఇచ్చేప్పుడు వీటిని ఎందుకు చెప్పలేదు? మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం అవసరమైతే కొత్త బస్సులు సమకూర్చుకోవడం, సిబ్బందిని సమాయత్తం చేసుకోవాల్సిన అవసరం లేదా? నేడు ఉచిత బస్సు కోసం మహిళలు పడుతున్న బాధలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక నిబద్దతతో అమలు చేయాలనే చిత్తశుద్ది లేదు.

నాడు-నేడు స్కూళ్ళ ఆధునీకరణను కక్షపూరితంగా ఆపేశారు. పేద విద్యార్ధులకు మంచి సదుపాయాలు కల్పించడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. పద్నాలుగు నెలల్లో కలుషిత ఆహారంతో విద్యార్ధులు అస్వస్తతకు గురవుతున్న సంఘటనలు అనేకం జరిగాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్లే. ఇక శాంతిభద్రతల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పోలీసులంటే ప్రజలకు భయం, భక్తీ లేకుండా చేశారు. రాజకీయ వేధింపులకే పోలీసులను పరిమితం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అవినీతి పెచ్చుపెరిగి పోయింది.

Also Read : Monorail Train: ముంబైలో ట్రాక్‌ మధ్యలో నిలిచిన మోనో రైలు

Leave A Reply

Your Email Id will not be published!