MP B. B. Patil: బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ !
బీజేపీలో చేరిన బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్ !
MP B. B. Patil: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలోని బీఆర్ఎస్ పార్టీకు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి… బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్(MP B. B. Patil) బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అంతకుముందు తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలంటూ లేఖలో పేర్కొన్నారు.
MP B. B. Patil Join in BJP
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీజేపీ తన లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించడానికి కసరత్తులు చేస్తుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు చేయడం కోసం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ నిర్వహించింది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగిన ఈ సమావేశంలో మొదటి జాబితాను దాదాపు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్ కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : PM-Surya Ghar Muft Bijli Yojana: ‘పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం !