BV Pattabhiram: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ మృతి

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ మృతి

BV Pattabhiram : ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. మంగళవారం ఖైరతాబాద్‌‌లోని స్వగృ‌హంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పట్టాభిరామ్ వయస్సు 75 సంవత్సరాలు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ పార్థీవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పట్టాభికి భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు.

BV Pattabhiram No More

1949లో తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన బీవీ పట్టాభిరామ్ (BV Pattabhiram)… కౌమారదశలో కాలి వైకల్యం కారణంగా… ఆత్మన్యూనతా భావాన్ని జయించేందుకు ఇంద్రజాలికుడిగా, రచయితగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి వద్ద ఆ విద్యను నేర్చుకున్నారు. ఒకటి రెండు టాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు.

దాదాపు అర్ధశతాబ్దంపాటు ఇంద్రజాలికుడిగా, సైకాలజిస్టుగా సమాజానికి సేవలందించారు పట్టాభిరామ్ (BV Pattabhiram). ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా సైతం పొందారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నోటిజనంలో పీహెచ్‌డీ చేశారు. భారత ఆహార సంస్థలో ఆయన ఉద్యోగిగా విధులు నిర్వహించారు. పలు పురస్కారాలను సైతం అందుకున్నారు.

పట్టాభిరామ్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంతాపం

ప్రముఖ ఇంద్రజాలికులు, హిప్నాటిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ (BV Pattabhiram) మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా వినోదాన్ని పంచడమే కాకుండా మూఢ నమ్మకాలు పారద్రోలేలా ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వ్యక్తిత్వ వికాసంతోపాటు మనస్తత్వ శాస్త్రంపై ఆయన పలు రచనలు చేశారని వివరించారు. డా. పట్టాభిరామ్ కుటుంబానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం

ప్ర‌ముఖ‌ హిప్నాటిస్టు, మెజీషియన్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా. బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఇంద్రజాలికుడిగా, రచయితగా ఆయన ప్రసిద్ధి చెందారని, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో పట్టాభిరామ్ రాసిన పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయన్నారు. అలాగే విద్యార్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లో వేలాది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, వర్క్‌షాపులు, సెమినార్లను నిర్వహించి వారి జీవితాలపై ప్రభావం చూపారన్నారు. పట్టాభిరామ్‌ మృతితో విద్యా, వ్యక్తిత్వ వికాస రంగాల్లో తీవ్ర లోటు ఏర్పడిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు. పట్టాభిరామ్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

‘‘బీవీ పట్టాభిరామ్ మృతి బాధించింది. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ.. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు భగవంతుడు మ‌నోధైర్యం ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ కూడా చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డా. బి.వి. పట్టాభిరామ్ గారి మృతి బాధించింది. ఆయన ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ ఆయన కుటుంబ స‌భ్యుల‌కు భగవంతున్ని మ‌నోధైర్యం ప్ర‌సాదించాల‌ని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ చేసారు.

Also Read : PM Narendra Modi: 8 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!