Zaheerabad: జహీరాబాద్‌ లో పారిశ్రామిక నగరం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం !

జహీరాబాద్‌ లో పారిశ్రామిక నగరం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం !

Zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌(Zaheerabad)లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ పారిశ్రామిక కారిడార్‌ లో భాగంగా జహీరాబాద్‌(Zaheerabad) పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో 3,245 ఎకరాల్లో, రూ.2,361 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ ఆటోమొబైల్, రవాణా పరికరాలు, మెటాలిక్, నాన్‌-మెటాలిక్‌ మినరల్స్, ఆహారశుద్ధి, విద్యుత్‌ పరికరాలు తయారు చేస్తారు. ఇది హైదరాబాద్‌ మహానగరానికి అనుబంధంగా పనిచేయనుంది.

Zaheerabad – దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలు

2047 నాటికి భారత్‌ను వికసిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ… ఆ ఎజెండా అమలులో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో రూ.28,602 కోట్ల విలువైన 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలను నిర్మించాలని నిర్ణయించగా అందులో తెలంగాణకు ఒకటి దక్కింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 12 పారిశ్రామిక నగరాలు భారతదేశ కంఠానికి మణిహారంగా భాసిల్లుతాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వీటికి ‘గ్రాండ్‌ నెక్లెస్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీస్‌’గా నామకరణం చేసింది. వీటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేస్తారు. భవిష్యత్తులో ఎదురయ్యే డిమాండ్లను అందుకోవడానికి వీలుగా ప్లగ్‌ అండ్‌ ప్లే, వాక్‌ టు వర్క్‌ లక్ష్యంతో వీటిని తీర్చిదిద్దుతారు. ఇందులో అత్యాధునిక మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ 12 పారిశ్రామిక నగరాల ద్వారా 10 లక్షల మందికి ప్రత్యక్ష, 30 లక్షల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కేవలం జీవనోపాధి సృష్టించడమే కాకుండా ఆ ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వేగంగా పారిశ్రామికాభివృద్ధి: కిషన్‌రెడ్డి

తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక నగరం ద్వారా తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో ఈ పారిశ్రామిక నగర నిర్మాణం జరుగుతుందని చెప్పారు. మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల్లో విస్తరిస్తుందని వెల్లడించారు. తొలి దశలో 3,245 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 65 కిలోమీటర్లు, రీజినల్‌ రింగు రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు వస్తుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన 3,245 ఎకరాల్లో 3,100 ఎకరాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని, రాష్ట్రానికి సంబంధించి షేర్‌ హోల్డర్, స్టేట్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్లు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. ఈ నగరానికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి ఇప్పటికే అందినట్లు వెల్లడించారు. తెలంగాణకు ప్రధాన ప్రాజెక్టును కేటాయించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌లకు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ప్రధానికి మంత్రి శ్రీధర్‌బాబు ధన్యవాదాలు

తెలంగాణ సామర్థ్యంపై నమ్మకం ఉంచి… జహీరాబాద్‌(Zaheerabad) వంటి ప్రాంతాలకు సాధికారత కల్పించడానికి చొరవ చూపినందుకు ప్రధాని మోదీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. దీనికి సహకరించిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పీయూష్‌ గోయల్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తం చేశారు.

Also Read : Railway Board: రైల్వేబోర్డు ఛైర్మన్‌గా సతీశ్‌కుమార్‌ !

Leave A Reply

Your Email Id will not be published!