Amarinder Singh : ఆప్ దెబ్బ‌కు కెప్టెన్ అవుట్

19 వేల 797 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం

Amarinder Singh  : సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా పేరొందిన మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్(Amarinder Singh )కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ‌కు కెప్టెన్ ఘోరంగా ఓట‌మి పాల‌య్యారు.

పంజాబ్ రాజ‌కీయాల‌లో ఆప్ కీల‌క పాత్ర పోషిస్తోంది. 117 సీట్ల‌కు గాను ఇప్ప‌టికే 58 సీట్ల‌ను చేజిక్కించుకుంది. క్లీన్ స్వీప్ చేసే దిశ‌గా సాగుతోంది. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రంగా కీల‌క‌మైన నాయ‌కుడిగా పేరొందారు అమ‌రీంద‌ర్ సింగ్.

ఆయ‌న గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క అని అనుకున్నారంతా. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ‌మైన నాయ‌కుడిగా పేరొందారు. మొన్న‌టి దాకా పంజాబ్ కు రాష్ట్ర సీఎం గా ఉన్నారు. కానీ అనుకోని రీతిలో సిద్దూతో పొస‌గ‌క రాజీనామా చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థి చేతిలో అనూహ్యంగా ప‌రాజ‌యం పాల‌య్యారు. పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న‌కు పెట్ట‌ని కోట‌గా ఉంటూ వ‌చ్చింది.

ఈసారి కూడా ఇక్క‌డి నుంచే బ‌రిలో దిగారు. ఆప్ అభ్య‌ర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో 19 వేల 797 ఓట్ల తేడాతో ఓట‌మి చ‌వి చూశారు. సిద్దూతో గొడ‌వ‌, కాంగ్రెస్ పార్టీలో లుక‌లుక‌ల వ‌ల్లే ఆయ‌న పార్టీని వీడారు.

ఈసారి అమ‌రీంద‌ర్ సింగ్ (Amarinder Singh ) సైతం ఊహించ‌ని రీతిలో షాక్ ఇచ్చారు పాటియాలా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు. మ‌హా మ‌హులంతా మ‌ట్టి క‌రిచారు ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ‌కు. ఎవ‌రూ గెలిచే ప‌రిస్థితి లేదు.

ఆప్ క్యాండిడేట్ దెబ్బ‌కు అమ‌రీందర్ సింగ్ తో పాటు స‌న్నిహితులు సైతం విస్తు పోయారు.

Also Read : పంజాబ్ ను ఊడ్చేసిన ఆప్ చీపురు

Leave A Reply

Your Email Id will not be published!