Satya Pal Malik: మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్ నివాసంలో సీబీఐ సోదాలు !

మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్ నివాసంలో సీబీఐ సోదాలు !

Satya Pal Malik: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ ను నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జమ్ములో రూ. 2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (హెచ్‌ఇపి)లో పనులు కేటాయింపులో అవినీతి జరిగిందనే ఆరోపణలపై మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహా ఐదుగురిపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారు సుమారు 100 మంది అధికారులు మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంతో పాటు 30 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సీబీఐ అధికారుల సోదాలపై మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌ తన అఫీషియల్ ఎక్స్ (ట్విటర్‌) హ్యాండిల్ ద్వారా స్పందిస్తున్నారు.

Satya Pal Malik House Investigation Updates

‘నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ… నా నివాసంపై నిరంకుశ శక్తులు దాడి చేస్తున్నాయి. ఈ సోదాల ద్వారా నా డ్రైవర్, సహాయకుడిని వేధిస్తున్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నేను రైతులకు అండగా నిలుస్తాను’ అని ట్వీట్ చేసారు. అవినీతికి పాల్పడిన వారిపై నేను ఫిర్యాదు చేస్తే… ఆ వ్యక్తుల్ని విచారించకుండా నా నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. ఇంట్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప మరేమీ వాళ్లకు దొరకలేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఆ నియంత నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. నేను రైతు బిడ్డను… ఎవరికీ భయపడను… తలవంచను అంటూ మరో పోస్ట్‌ లో పేర్కొన్నారు సత్యపాల్ మాలిక్.

చరణ్‌ సింగ్‌ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్‌ మాలిక్‌. ఆ తర్వాత భారతీయ లోక్‌ దల్‌ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్‌… 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఆ తరువాత బీహార్‌, జమ్ము కశ్మీర్‌, గోవా, మేఘాలయాకు గవర్నర్‌ గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో సత్యపాల్ మాలిక్ గవర్నర్‌ గా ఉన్నారు.

2018 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌ గా విధులు నిర్వర్తించిన సత్యపాల్ మాలిక్‌(Satya Pal Malik)… ఆ సమయంలో తన వద్దకు రెండు దస్త్రాలు వచ్చాయని, వాటిపై సంతకం చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పినట్లు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక దస్త్రం హైడ్రో ప్రాజెక్టుదని తెలిపారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌ లో మాలిక్‌ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి కిరూ హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించింది కాగా… రెండోది ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కు సంబంధించినది.

ఇది ఇలా ఉండగా… రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో సత్యపాల్ మాలిక్(Satya Pal Malik) తీరు చర్చనీయాంశంగా మారింది. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్‌ 14వ తేదీన) కరణ్‌ థాపర్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ గవర్నర్‌ గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్‌ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్‌ పాక్‌ నుంచి రావడం, జమ్ము కశ్మీర్‌ లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్‌ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : YS Sharmila : చంద్రబాబు జగన్ ను కలిపి ఏకిపారేసిన వైఎస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!