Drugs in Visakhapatnam: విశాఖ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత ! 25 టన్నుల డ్రగ్స్ ను సీజ్ చేసిన సీబిఐ !
విశాఖ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత ! 25 టన్నుల డ్రగ్స్ ను సీజ్ చేసిన సీబిఐ !
Drugs in Visakhapatnam: ఉత్తర అమెరికాలోని టూ ఇండియా వయా జర్మనీ కేంద్రంగా జరుగుతున్న అక్రమ మాదక ద్రవ్యాల రవాణా రాకెట్ ను సీబీఐ అధికారులు బట్టబయలు చేసారు. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుండి విశాఖపట్నం పోర్టుకు ‘ఎస్‌ఈకేయూ 4375380’ కంటెయినర్ లో ‘డ్రైడ్ ఈస్ట్’ మాటున తరలిస్తున్న 25,000 కేజీలు నిషేదిత నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లు సీబీఐ(CBI) సీజ్ చేసారు. ఈ మేరకు ఆ కంటెయినర్ ను దిగుమతి చేసుకున్న సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మాత్రం తాము రొయ్యల మేతకు ఉపయోగించే డ్రైడ్ ఈస్ట్ దిగుమతి చేసుకున్నామని…. అందులో ఏం వచ్చిందనే దానిపై మాకు అవగాహన లేదని అంటున్నారు. అంతేకాదు ఆ కంపెనీ నుండి బుక్ చేసిన ఫస్ట్ కన్ సైన్ మెంట్ అని అంటున్నారు.
Drugs in Visakhapatnam Viral
జనవరి 14న బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుండి బయలుదేరిన కంటెయినర్ లో నిషేదిత మాదక ద్యవ్యాలు ఉన్నాయని ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోనికి దిగిన సీబీఐ అధికారులు విశాఖ(Visakhapatnam) పోర్టుకు ఈ నెల 19న చేరుకున్న కంటెయినర్ లో తనిఖీలు నిర్వహించారు. రొయ్యల మేత కోసం ఉపయోగించే డ్రైడ్ ఈస్ట్ పేరుతో ఈ కన్ సైన్ మెంట్ ను బుక్ చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధుల సమక్షంలో కంటైనర్ లో తనిఖీలు నిర్వహించారు. ఢిల్లీ నుండి ప్రత్యేకంగా వచ్చిన సీబీఐ అధికారులు ఉమేశ్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానికంగా కస్టమ్స్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టింది.
ఈ తనిఖీల్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్ లను కంటైనర్ లో గుర్తించారు. అనంతరం గుజరాత్ ల్యాబ్ నుండి సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించి… డ్రైడ్ ఈస్ట్ లేబుల్ ఉన్న ఆ బ్యాగుల్లో సేకరించిన నమూనాలకు నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా పరీక్షించారు. అయితే ఆ పదార్ధాలు నిషేదిత నార్కోటిక్ డ్రగ్స్ అని సీబీఐ(CBI) ప్రాధమిక పరీక్షల్లో తేలింది. మొత్తం 49 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 27 శాంపిల్స్ లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫటేమిన్, మెస్కలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలున్నట్లు తేలింది. ర్యాండమ్‌గా తనిఖీ చేసిన మరో 20 శాంపిల్స్ లోనూ కొకైన్, మెథాక్వలోన్ అనే రెండు రకాల డ్రగ్స్ కలిసి ఉన్నట్లు ఫలితాలొచ్చాయి.
దీనితో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం సెక్షన్ 29రెడ్‌విత్ 8, 23, 38 ప్రకారం సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్లిమిటెడ్ సహా, గుర్తు తెలియని మరికొందరిపైనా కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోర్టు ఉద్యోగులు సంఘటన స్థలం వద్ద గుమిగూడటంతో కేసు విచారణలో కొంత జాప్యం అయినట్లు సీబీఐ(CBI) ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ మాదకద్రవ్యాలు అత్యంత ఖరీదైనవిగా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ 25వేల కిలోల్లో భారీ మోతాదులో మాదకద్రవ్యాలు లభిస్తే రూ. లక్షల కోట్ల డ్రగ్స్ రాకెట్‌గా ఈ కేసు నిలుస్తుంది. ఇందులో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ప్రమేయం ఉండొచ్చని సీబీఐ భావిస్తోంది.
డ్రైడ్ ఈస్ట్ దిగుమతికి చెల్లింపులు, అనుమతులు తీసుకున్నాం- సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులు
తమ కంపెనీ దిగుమతి చేసుకున్న డైడ్ ఈస్ట్ మాటున మాదక ద్రవ్యాలు బయటపడటంపై ప్రకాశం జిల్లా ఈదుమూడికి చెందిన సంధ్యా ఆక్వా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ స్పందించారు. రొయ్యల మేతలో ఉపయోగించే డ్రైడ్ ఈస్ట్ కోసం బ్రెజిల్ కంపెనీను ఆన్ లైన్ ద్వారా సంప్రదించాం. ఈ మేరకు 25 టన్నుల డ్రైడ్ ఈస్ట్ దిగుమతికి అనుమతులు తీసుకున్నాం. అయితే విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్ లో ఎర్ర చందనం ఉందని తొలుత సీబీఐ అధికారులు మమ్మల్పి పిలిపించి… మా సమక్షంలో కంటైనర్ ను ఓపెన్ చేసారు. అందులో ఉన్న పదార్ధాలను కెమికల్ టెస్ట్ చేసి మాదక ద్రవ్యాలు అని చెప్తున్నారు. మేము తొలిసారిగా ఈ రొయ్యల ఆహార తయారీకి దిగుమతి చేసుకున్నాం. దానిని దేనితో తయారుచేస్తారో మాకు తెలియదు. అందులో ఏమి పంపించారో కూడా మాకు తెలియదని సంధ్యా ఆక్వా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూనం హరికృష్ణ, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ వివరణ ఇచ్చారు.
Also Read : Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలా మాతృమూర్తి ఐవీఎఫ్ పై నివేదిక కోరిన కేంద్రం !