CDS Anil Chauhan: భారత్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాలి – సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

భారత్‌ అత్యంత అప్రమత్తంగా ఉండాలి - సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

CDS Anil Chauhan : పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి లక్ష్యంగా భారత్ చేపట్టిన మిలటరీ చర్య ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) తెలిపారు. కాబట్టి భారత్‌ 365 రోజులూ, 24 గంటలూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ హెచ్చరించారు. ఆయుధాలు, ఇతర పరిజ్ఞానం గురించి మిలిటరీ పూర్తిగా అప్‌డేట్‌ అయి ఉండాలని అభిప్రాయపడ్డారు. యుద్ధాల గతి మారిపోతోందని సీడీఎస్‌ వెల్లడించారు. భవిష్యత్తులో దళాల్లో ఇన్ఫో-టెక్‌తో పాటు స్కాలర్‌ వారియర్స్‌ కలగలిసి ఉంటాయన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఇందుకు తగ్గట్టుగా బలగాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని అన్నారు. సుబ్రతోపార్క్‌లో జరిగిన డిఫెన్స్‌ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు.

CDS Anil Chauhan Key Comments

యుద్ధాల్లో రన్నరప్‌ లు ఉండరని సీడీఎస్‌ గుర్తు చేశారు. అందుకే సైన్యాలు అప్రమత్తంగా ఉంటూ.. ఏ క్షణమైనా ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. దీనికి ఆపరేషన్‌ సిందూర్‌నే (Operation Sindoor) ఆయన ఉదాహరణగా చూపారు. భారత మిలిటరీకి భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్‌ వారియర్స్‌, టెక్నాలజీ వారియర్స్‌, స్కాలర్‌ వారియర్స్‌ అవసరం చాలా ఉందని చెప్పారు. మారుతున్న పరిణామాల ఆధారంగా.. భవిష్యత్తు సైనికులు ఈ మూడు నైపుణ్యాల కలబోతగా ఉంటారని పేర్కొన్నారు. సైనిక దళాల్లో జరుగుతున్న మార్పుల మూడో విప్లవం కీలక దశలో మనం ఉన్నట్లు వెల్లడించారు. దానిని తాను కన్వర్జెన్సీ యుద్ధంగా అభివర్ణిస్తానన్నారు. ఇది కైనటిక్‌, నాన్‌-కైనటిక్‌ మిశ్రమంగా ఉంటుందన్నారు.

ఏప్రిల్‌ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌.. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ క్రమంలో రావల్పిండి, పీవోకే సహా పలు ప్రాంతాల్లోని టెర్రర్‌ క్యాంప్‌లను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఆరుకుపైగా వైమానిక స్థావరాలు కూడా ధ్వంసం అయ్యాయి. కొన్ని చోట్ల రెండు నెలలు దాటినా వాటి మరమ్మతులు ఇప్పటికీ పూర్తికాలేదు.

పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో ఇందుకు ప్రతిగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్‌లోకి చొచ్చుకెళ్లి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇందుకు బదులుగా మే 8,9,10 తేదీల్లో భారత మిలటరీ స్థావరాలపై డ్రోన్లు, క్షిపణలుపై దాడులకు పాక్ తెగబడింది. వీటిని భారత బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణకు మే 10న పాక్ ప్రతిపాదన చేయడంతో భారత్ అంగీకరించింది.

Also Read : Visakha Metro: విశాఖ మెట్రో టెండర్లకు శ్రీకారం ! మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్లు !

Leave A Reply

Your Email Id will not be published!