Ceasefire: 19 రోజుల తరువాత సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు
19 రోజుల తరువాత సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు
Ceasefire : ఏప్రిల్ 24న కాశ్మీర్ లోని బైసరన్ లోయలోని పహాల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు విచక్షిణారహితంగా జరిపిన ఈ దాడుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు భారత్ దిగింది. దీనిలో భాగంగా ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన భారత్… పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగా… సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తో కకావికలమైన పాకిస్తాన్… కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ(Ceasefire)… భారత్ పాక్ సరిహాద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది.
Ceasefire Effect…
ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహాద్దుల్లో పాకిస్తాన్ భద్రతా బలగాలు డ్రోన్ల దాడులకు పాల్పడుతున్నాయి. అయితే వాటిని భారత్ త్రివిద దళాలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నాయి. భారత్ జరిపిన దాడులతో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్… అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా కాల్పుల విరమణకు(Ceasefire) రాజీ ప్రయత్నాలు చేసింది. దీనికి భారత్ కూడా అంగీకరించడంతో శనివారం సాయంత్ర 5 గంటల నుండి కాల్పులను విరమిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్దిని మాత్రం మార్చుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ పై డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. దీనితో భారత్ పాక్ సరిహాద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే కాల్పుల విరమణపై(Ceasefire) పాకిస్తాన్(Pakistan) యొక్క రెండు నాల్కల ధోరణి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశగా మారడంతో… శనివారం రాత్రి 11 గంటల నుండి దాడులను ఆపివేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను ఉల్లంఘించిన ఘటనలు శనివారం రాత్రి 11గంటల తర్వాత ఎక్కడా నమోదు కాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దుల్లో ఎక్కడా డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్‌క్రాప్ట్ ల శబ్దాలు వినిపించలేదని తెలిపాయి. శనివారం అర్థరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు నమోదు కాలేదు. అఖ్నూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను యథావిధిగా చేసుకోవచ్చని సరిహద్దు జిల్లాల్లోని అధికార యంత్రాంగాలు సూచించాయి. కశ్మీర్ లోయలో శనివారం రాత్రి ప్రశాంతంగా గడిచిందని అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు జైసల్మేర్ నగరంలో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోతలు వినిపించడంలేదు. అయితే ముందు జాగ్రత్తగా సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు బ్లాక్అవుట్ విధించారు.
‘‘ఐదు రోజుల తర్వాత మేం ప్రశాంతంగా నిద్రపోయాం. యుద్ధం ఆగేలా చేసినవారందరికీ, ఆ దేవుడికి మేం రుణపడి ఉంటాం’’ అని రావల్పొరాకు చెందిన షాజహాన్ దర్ చెప్పాడు. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ శనివారం సాయంత్రం 5గంటలకు అమల్లోకి వచ్చింది. అయితే, తర్వాత కొద్ది సేపటి వరకు డ్రోన్లు, రాకెట్లు కనిపించాయమని ఉరీకి చెందిన అబ్దుల్ అజీజ్ చెప్పాడు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లోని చాలా మంది వలసవెళ్లారని, కాల్పుల విరమణ జరిగినప్పటికీ వారు ఇప్పుడే స్వస్థలాలకు రావాలనుకోవట్లేదని, ఇంకొన్ని రోజులు వేచి చూడాలని భావిస్తున్నట్లు వివరించాడు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లో కూడా శనివారం రాత్రి సాధారణ పరిస్థితి నెలకొంది. అయితే, జలంధర్ జిల్లాలో టపాసులపై నిషేధం విధించారు. పహల్గాం దాడి తర్వాత నుంచి ఎల్ఓసీ వద్ద అలజడి నెలకొనగా.. 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏప్రిల్ 24 నుంచి ప్రతి రోజూ పాక్ కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత… పౌర నివాసాలే లక్ష్యంగా దాయాది సైన్యం మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగింది. దీనితో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడంతో భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాల నుంచి పౌరులను ఖాళీ చేయించారు. దీనితో గత కొద్ది రోజులుగా వారు సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు. అయితే, ఇప్పుడే స్వస్థలాలకు వెళ్లొద్దని సరిహద్దు గ్రామప్రజలను జమ్మూకశ్మీర్ యంత్రాంగం హెచ్చరించింది. పేలని షెల్స్ ఇంకా ఉంటాయని, వాటిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది. ఇక, పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోనూ నిన్న రాత్రి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. అయినప్పటికీ భద్రతా బలగాలు పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి.
Also Read : Gold Robbery: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ లో భారీ దొంగతనం