Special Status : బిహార్ కు ప్రత్యేక హోదా ప్రతిపాదన లేదని స్పష్టం చేసిన కేంద్రం !
బిహార్ కు ప్రత్యేక హోదా ప్రతిపాదన లేదని స్పష్టం చేసిన కేంద్రం !
Special Status: బిహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)… బిహార్ కు ప్రత్యేక హోదా(Special Status) లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఇటువంటి స్పందన వచ్చింది.
ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బిహార్(Bihar)తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా..? అని జేడీయూ ఎంపీ రామ్‌ప్రిత్ మండల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బిహార్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్ వేదికగా వెల్లడించారు.
Special Status for…
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ కీలకంగా మారింది. 12 మంది సభ్యుల బలంతో కూటమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దీనితో ప్రత్యేక హోదా ప్రతిపాదనను జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) తెర పైకి తెచ్చింది. అదే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యం అని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. దానిని ఇవ్వడంలో కేంద్రానికి ఏదైనా సమస్య ఉంటే… తాము ప్రత్యేక ప్యాకేజీని కోరతామని తెలిపారు. ఇక కేంద్రం నుంచి వచ్చిన స్పందనపై విపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శలు గుప్పించింది. ‘‘కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయిన జేడీయూ ఆ ఫలితాలను అనుభవించాలి. ప్రత్యేక హోదాపై వారి నాటకాలను కొనసాగించాలి’’ అని ఎద్దేవా చేసింది.
మరోవైపు బీహార్ కు జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన నేపథ్యంలో…. ఎన్డీఏలో రెండో అతి పెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ కూడా ఏపీకు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో బీహార్ కు ప్రత్యేక హోదా ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టం చేయడం… ఏపీకు ప్రత్యేక హోదా ప్రతిపాదన కూడా మరుగున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : NEET Paper Leak: పార్లమెంట్‌లో ‘నీట్’ రగడ ! విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు !