TTD EO : లోక కళ్యాణం కోసం చతుర్వేద హవనం
టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడి
TTD EO : దేశం, రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంతో ఉండాలని కోరుతూ తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిపాలన భవనం ప్రాంగణంలో తొలిసారిగా చతుర్వేద హవనం నిర్వహించారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగిందని, బుధవారం నాటితో ముగిసిందని చెప్పారు. ఇవాళ ఈవో మీడియాతో మాట్లాడారు. లోక కళ్యాణం కోసం ఈ యాగాన్ని చేపట్టామని తెలిపారు. ఇందులో 32 మంది రుత్వికులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం నాలుగు వేదాలను పారాయణం చేశారని వెల్లడించారు ఈవో.
ఇక సాయంత్రం వేళ ప్రముఖ పండితులతో ధార్మిక ప్రవచనాలు, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో సంగీత , నృత్య కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు ఏవీ ధర్మారెడ్డి. తిరుపతి వాసులు విశేషంగా యాగంలో పాల్గొన్నారని తెలిపారు. చతుర్వేద హవనాన్ని చక్కగా నిర్వహించిన అధికారులకు, పండితులకు, రుత్వికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు ఈవో.
టీటీడీ జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో చతుర్వేద హవనాన్ని తిరుపతిలో నిర్వహించడం జరిగిందన్నారు. ఇది కీలకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ హవనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు.
Also Read : Satya Pal Malik : అధికార మదానికి పరాకాష్ట – మాలిక్