Chintakayala Ayyannapatrudu: అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ! ‘ఈటీవీ’పై ఉన్న ఆంక్షలు రద్దు చేస్తూ తొలి సంతకం !

అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ! ‘ఈటీవీ’పై ఉన్న ఆంక్షలు రద్దు చేస్తూ తొలి సంతకం !

Chintakayala Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం అయ్యన్నపాత్రుడి(Chintakayala Ayyannapatrudu)ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, మంత్రులు సత్యకుమార్ యాదవ్, కింజరాపు అచ్చెన్నాయుడు సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గా తనకు అవకాశం ఇవ్వడం పట్ల మూడు పార్టీల అధినేతలు, ఎమ్మెల్యేలకు అయ్యన్నపాత్రుడు కృతజ్ఞత తెలిపారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ… ఎమ్మెల్యే అనేది పదవి కాదని బాధ్యత అని గుర్తు చేసారు. కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా సభను సజావుగా నిర్వహించడానికి సహకరించి… ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా అసెంబ్లీను ఉపయోగించుకోవాలని హితవుపలికారు.

Chintakayala Ayyannapatrudu – ‘ఈటీవీ’పై ఉన్న ఆంక్షలు రద్దు చేస్తూ తొలి సంతకం !

అసెంబ్లీలోని స్పీకర్‌ కార్యాలయంలో ప్రత్యే పూజలు నిర్వహించిన అనంతరం సభాపతి అయ్యన్నపాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘ఈటీవీ’కి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల దస్త్రాన్ని కొట్టివేస్తూ అయ్యన్నపాత్రుడు తొలి సంతకం చేశారు. ఈటీవీని సభలోకి రావొద్దని పిచ్చి నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ అసెంబ్లీ కార్యదర్శిని ఆయన నిలదీశారు. ఈటీవీ, ఇతర ఛానెళ్లపై ఉన్న ఆంక్షలు తొలగించాలంటూ స్పీకర్‌ కు టీడీపీ సీనియర్‌నేత ధూళిపాళ్ల నరేంద్ర లేఖ ఇచ్చారు. తక్షణమే ఆంక్షలు సడలిస్తూ సభాపతి లేఖ ఇచ్చారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyannapatrudu)కి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. పదిసార్లు నర్సీపట్నం నుంచి పోటీచేసి ఏడుసార్లు గెలిచారు. ఇప్పటివరకూ ఐదు ప్రభుత్వాల్లో సాంకేతిక విద్య-క్రీడలు, రహదారులు-భవనాలు (రెండు సార్లు), అటవీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవమూ ఆయనకు ఉంది.

Also Read : MLA Medipally Sathyam: కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య !

Leave A Reply

Your Email Id will not be published!