Chirag Paswan: నీతీశ్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు
నీతీశ్ కుమార్ పై చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు
Chirag Paswan : మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పై కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఎన్నికల్లో నితీశ్ కుమార్ (CM Nitish Kumar) కు మద్దత్తు ఇచ్చిన చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan)… నీతీశ్ సర్కారుకు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Union Minister Chirag Paswan Shocking Comments Bihar CM
తాజాగా బిహార్ లో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని స్పృహతప్పి పడిపోగా… అంబులెన్స్‌లో ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై చిరాగ్ స్పందిస్తూ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘‘నేరస్థుల ముందు బిహార్ యంత్రాంగం తేలిపోతోంది. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు నిరంతరం జరుగుతున్నాయి. ఈ నేరాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనిపిస్తోంది. క్రైమ్ రేటును ప్రభుత్వం తగ్గించలేకపోతోంది. బిహార్‌లో ప్రజలు సురక్షితంగా ఉండలేకపోతున్నారు. ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా ఉంది. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాల్సిన సమయం వచ్చింది. నేరాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలి’’ అని చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై నితీష్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌ను చిరాగ్ పాశ్వాన్ విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. నేరస్థుల నైతిక స్థైర్యానికి హద్దులు లేకుండా పోయాయని పాశ్వాన్ గత నెలలో విమర్శించారు. ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నాయని, నేరస్థులు బహిరంగంగానే శాంతి భద్రతలపై సవాళ్ళు విసురుతున్నారని ఆక్షేపణ తెలిపారు.
ప్రస్తుతం బిహార్ లోని ఎన్డీయే ప్రభుత్వంలో చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని కేంద్రమంత్రి ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజా వ్యాఖ్యాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే బిహార్‌లో వరుస నేరాలపై ఆర్జేడీ, ఇతర విపక్షాలు నీతీశ్ సర్కారుపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సొంతకూటమి నుంచి కూడా విమర్శలు ఎదురవడంతో ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడినట్లయ్యింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈసీ ఓటరు సమగ్ర సవరణ సర్వే చేపట్టింది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Also Read : Bomb Threat: రాజస్థాన్ సీఎంఓ, జైపూర్ ఎయిర్‌పోర్టు కు బాంబు బెదిరింపు
