Aadudam Andhra: ‘ఆడుదాం ఆంధ్ర’ నిధుల దుర్వినియోగంపై విచారణకు సీఐడి ఆదేశం !

‘ఆడుదాం ఆంధ్ర’ నిధుల దుర్వినియోగంపై విచారణకు సీఐడి ఆదేశం !

Aadudam Andhra: గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర(Aadudam Andhra), సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ క్రీడా సంఘాలు, సీనియర్‌ క్రీడాకారులు సీఐడీకి చేసిన ఫిర్యాదుల మేరకు తదుపరి చర్యలకు సీఐడీ సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలోనే ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ నిధులు దుర్వినియోగం చేసిన అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు కృష్ణదాస్‌ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డీ ప్రసాద్‌ చేసిన ఫిర్యాదుపై సీఐడీ స్పందించి, తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Aadudam Andhra Case…

సార్వత్రిక ఎన్నికల ముందు రూ.150 కోట్లతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు ఇప్పటికీ పెద్దఎత్తున ఫిర్యాదులొస్తున్నాయి. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్‌ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా వాటి నాణ్యతలో డొల్లతనం అప్పట్లోనే బయటపడింది. జర్సీల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడలశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సైతం ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ, వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని? క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని? వాటిలో నాణ్యత తదితర అంశాలపై సమగ్ర విచారణ చేయించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం సీఐడీ విచారణకు ఆదేశించాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Also Read : CM Revanth Reddy: హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన !

Leave A Reply

Your Email Id will not be published!