Clashes in Nagpur: నాగ్ పూర్ లో చెలరేగిన అల్లర్లు! పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు!

నాగ్ పూర్ లో చెలరేగిన అల్లర్లు! పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు!

Clashes in Nagpur : మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు(Aurangzeb) సమాధిని కూల్చేస్తామనే విశ్వహిందూ పరిషత్‌ చేసిన డిమాండ్లతో మొదలైన ఉద్రిక్తతలు చివరకు అల్లర్లకు దారితీశాయి. రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూడంతో పోలీసుల భాష్ప వాయువు ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టాల్సి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి నాగ్‌పుర్‌(Nagpur)లోని పలు ప్రాంతాల్లో ఈ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక, నాగ్‌పుర్‌లోని హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి. కొందరు దుండగులు వాహనాలకు నిప్పంటించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో దాదాపపు 20 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.

Clashes in Nagpur Viral

సోమవారం మధ్యాహ్నం మహల్‌ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌(Chhatrapathi Shivaji Maharaj) విగ్రహం వద్ద బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన అనంతరం ఈ సమస్య మొదలైట్లు తెలుస్తోంది. ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి. దీనితో నాగ్‌పుర్‌ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నానికల్లా కొత్వాలి, గణేశ్‌పేట్‌ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. చిట్నిస్‌ పార్క్, శుక్రవారి తలావ్‌ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సమస్యాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. మరోవైపు.. ఔరంగజేబు స్మారకం వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. శంభాజీనగర్‌ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు వెళ్లేవారు భద్రతా సిబ్బంది వద్ద రిజిస్టర్‌లో సంతకాలు చేయడంతోపాటు తమ గుర్తింపుపత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

దీనితో అల్లర్లను అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. నాగ్‌పుర్‌లోని(Nagpur) పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈమేరకు స్థానిక పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌కుమార్‌ సింగల్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాగ్‌పుర్‌ నగర పరిధిలోని కొత్వాలి, గణేశ్‌పేట్‌, లకడ్‌గంజ్‌, పచ్పావులి, శాంతినగర్‌, సక్కర్‌దర, నందన్‌వన్‌, ఇమామ్వాడ, యశోధర నగర్‌, కపిల్‌నగర్‌లలో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

‘‘కొందరు రాళ్లు రువ్వారు. దీనితో మేము కూడా తగు చర్యలు తీసుకున్నాము. భాష్ఫ వాయువు ప్రయోగించాము. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పాము. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. నా కాలికీ రాయి తగిలి గాయం అయ్యింది. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నాగ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్… శాంతిని నెలకొల్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘మహల్ ఏరియాలో రాళ్లు రువ్విన ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. నాగ్‌పూర్ ప్రశాంతమైన నగరమని, స్థానికులు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటారని అన్నారు. నాగ్‌‌పూర్ సంస్కృతి ఇదేనని, ప్రజలు వదంతులను నమ్మొద్దని సూచించారు.

ఇక నాగ్‌పూర్ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రజలు హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నాను. పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. కాబట్టి, వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.

Also Read : YV Subba Reddy: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం

Leave A Reply

Your Email Id will not be published!