Cloud Burst: ఉత్తరాఖండ్ లోని ధరాలీలో బురద వరద విలయం
ఉత్తరాఖండ్ లోని ధరాలీలో బురద వరద విలయం
Cloud Burst : ఉత్తరాఖండ్ లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలీ గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రం మీద పడిందా అన్న స్థాయిలో మేఘం వర్షించింది. దీనితో నీరు, అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరద ధరాలిని కప్పేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రదేశం మరు భూమిని తలపిస్తోంది.
క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కారణంగా ఉత్తరాఖండ్ (Uttarakhand) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ధరాలీ గ్రామం సమీపంలోని ఖీర్‌గఢ్ నదీ పరివాహక ప్రదేశంలో భారీ వర్షం కారణంగా నీరు నిలిచింది. ఇది ఒక్కసారిగా ధరాలీ మార్కెట్ ప్రదేశంపై విరుచుకుపడింది. ఆగస్టు 10వ తేదీ వరకు ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తాజాగా చోటుచేసుకున్న మెరుపు వరదల్లో 20 నుంచి 25 హోటళ్లు, హోమ్‌స్టేలు కొట్టుకుపోయాయి.
Cloud Burst – ఎక్కడుందీ ధరాలీ గ్రామం ?
చార్‌ధామ్ యాత్రికులు ఎక్కువగా ఈ ధరాలీ గ్రామాన్ని సందర్శిస్తుంటారు. యాపిల్స్‌కు ప్రసిద్ధిగాంచిన ఉత్తరాఖండ్‌లోని హర్సిల్ లోయ ఇక్కడకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) మారుమూల ఉన్న అత్యంత రమ్యమైన ప్రదేశాల్లో ఒకటి. దీని సమీపం నుంచే భాగీరథి నది ప్రవహిస్తోంది. రిషికేశ్ నుంచి బయల్దేరి చంబా, ఉత్తరకాశీ, హర్సిల్ మీదుగా ఇక్కడికి వెళ్లవచ్చు. సముద్రమట్టానికి దాదాపు 2,680 మీటర్ల ఎత్తున ఈ ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి గంగోత్రి ధామ్ కేవలం 20 కిలోమీటర్ల దూరం. గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతుంది. చార్‌ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సీజన్‌లో ధరాలీ గ్రామానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో లాడ్జిలు, అతిథి గృహాలున్నాయి. తక్కువ ధరలకే వసతి లభిస్తుండటంతో.. యాత్రికులు వీటి వైపు మొగ్గుచూపుతారు.
ఇక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో నీలాంగ్ లోయ ఉంది. భారత్-టిబెట్ మధ్య వ్యాపారం జరిగే పాత మార్గం ఇక్కడి నుంచి వెళుతుంది. ఇక్కడ రాత్రిళ్లు బస చేయడానికి అనుమతి లేదు. ఈ ప్రదేశాలను వీక్షించాలన్నా అటవీశాఖ అనుమతి ఉండాలి. ఇక ధరాలీ సమీపంలోని హార్సిల్ లోయలో భారీ విస్తీర్ణంలో యాపిల్ తోటలున్నాయి. చార్‌ధామ్ యాత్రికులు గంగోత్రికి వెళ్లే సమయంలో ఇక్కడ ఉండేందుకు ఇష్టపడతారు. కేదార్ తాల్ ప్రదేశానికి ట్రెక్కింగ్‌కు వెళ్లేవారికి ఈ ప్రాంతం బేస్‌క్యాంప్‌గా ఉంటుంది.
Cloud Burst – హిమాచల్‌లో వర్ష బీభత్సం ! 266 రోడ్లు మూసివేత !
హిమాచల్‌ప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎక్కడికక్కడ కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. ఉనా, బిలాస్‌పుర్, కాంగ్రా జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆట్- సైంజ్ జాతీయ రహదారి- 305 సహా మొత్తం 226 రోడ్లను అధికారులు మూసివేశారు. శిమ్లా పట్టణ శివారులోని పంతాఘటి వద్ద ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దగ్గర్లోని దుకాణాలు, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయి.
గడిచిన 24 గంటల్లో కసౌలిలో అత్యధికంగా 88 మి.మీ వర్షపాతం నమోదు కాగా… నైనా దేవి ప్రాంతంలో 62.6 మి.మీ, జోగీందర్‌నగర్‌లో 60 మి.మీ, బ్రాహ్మణి ప్రాంతంలో 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం (ఎస్‌ఈవోసీ) వెల్లడించిన వివరాల ప్రకారం… సోమవారం 266 రోడ్లను మూసివేయగా… అందులో కేవలం మండి జిల్లాలోనే 155 ఉన్నాయి. మరో 68 రోడ్లు కులు జిల్లాలో ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూన్ 20నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా రాష్ట్రంలో రూ.1,714 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. వర్షం కారణంగా 106 మంది ప్రాణాలు కోల్పోగా… 36 మంది ఆచూకీ గల్లంతైంది. అంతేకాకుండా 41 ట్రాన్స్‌ఫార్మర్లు, 282 రెండు తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : MP Sudha Ramakrishnan: దేశ రాజధానిలో మహిళా ఎంపీపై చైన్ స్నాచర్ దాడి
