Cloudburst: జమ్మూ ‘క్లౌడ్‌ బరస్ట్‌’ ! 60కి చేరిన మరణాలు !

జమ్మూ ‘క్లౌడ్‌ బరస్ట్‌’ ! 60కి చేరిన మరణాలు !

Cloudburst : జమ్మూకశ్మీర్‌ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుందని, మరో 100 మందికి గాయాలైనట్లు సీఎం ఒమర్‌ అబ్దుల్లా వెల్లడించారు. గల్లంతైన వారి కోసం రెండోరోజు ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. ప్రధాని మోదీ ఫోన్‌ చేసి పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు చెప్పారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఓ బీజేపీ నేత తెలిపిన వివరాల ప్రకారం… ఘటనా సమయంలో అక్కడ దాదాపు 1200 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కిశ్త్‌వాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరం చేయడంలో భాగంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు వెళ్లడం లేదని అధికారులు వెల్లడించారు. దీనితో సహాయక బృందాలు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాయన్నారు. పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్‌, స్థానిక స్వచ్ఛంద సంస్థలతోపాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైంది. ఇప్పటివరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

జమ్మూలో (Jammu) గురువారం మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఫలితంగా మచైల్‌ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్‌ మాతా దేవి యాత్రను నిలిపివేశారు.

Cloudburst – శిథిలాల కింద 500 మందికి పైనే – ఫరూక్‌ అబ్దుల్లా

జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం (క్లౌడ్‌ బరస్ట్‌) విలయం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదలతో 60 మంది ప్రాణాలు కోల్పోగా… 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 500 మందికి పైగా గల్లంతైనట్లు అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా వెల్లడించారు.

‘‘కిశ్త్‌వాడ్‌లో చోటుచేసుకున్న క్లౌడ్‌ బరస్ట్‌ (Cloudburst) లో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నా. కొందరు అధికారులు ఈ సంఖ్య 1000 దాటొచ్చని చెబుతున్నారు. ఇది తీవ్ర విషాదకరమైన క్షణం’’ అన్నారు. గతేడాది అక్టోబర్‌లో జమ్మూకశ్మీర్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒమర్‌ అబ్దుల్లా ప్రసంగించారు. ఈ విపత్తులో ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంతో విలువైన ప్రాణాలను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

జమ్మూకశ్మీర్‌ కొండల్లో మేఘ విస్ఫోటం (క్లౌడ్‌ బరస్ట్‌) బీభత్సం సృష్టించింది. మచైల్‌ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై విరుచుకుపడింది. ఒక్కసారిగా వచ్చి పడిన ఆకస్మిక వరదతో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి తనతో మాట్లాడారని, ఘటనా స్థలంలో పరిస్థితులు, కొనసాగుతోన్న సహాయక చర్యల గురించి ఆయనకు వివరించానని సీఎం ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. ఈ క్లౌడ్‌ బరస్ట్‌తో (Cloudburst) నష్టపోయిన వారికి సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు, ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఎన్డీఆర్‌ఎప్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, సైన్యం, స్థానిక వాలంటీర్లు సైతం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

Also Read : DK Shivakumar: ధర్మస్థళ తవ్వకాలపై డిప్యూటీ సీఎం డీకే సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!