CM Chandrababu: మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ – సీఎం చంద్రబాబు
మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ - సీఎం చంద్రబాబు
CM Chandrababu : తూర్పు తీర మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఏపీ మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, కర్ణాటక తదితర రాష్ట్రాల హింటర్ ల్యాండ్ కార్గోను కూడా ఏపీ పోర్టుల ద్వారా రవాణా చేసేలా కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఈస్ట్ కోస్ట్ మారీటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలలో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చంద్రబాబు (CM Chandrababu) పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించారు. అంతకు ముందు మారిటైమ్ రంగంలోని ఆరు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డీబీవీ స్వామి, మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఆ సంస్థ అధికారులు, జీఎఫ్ఎస్టీ వైస్ చైర్మన్ ఎస్.పి.టక్కర్ తదితరులు హాజరయ్యారు.
CM Chandrababu Key Updates
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. ‘‘దక్షిణాదిలో ఏపీ నెంబర్‌వన్ రాష్ట్రంగా మారుతుంది. భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్ పెరుగుతాయి. రోడ్ల అనుసంధానం జరిగినట్లు నదులను కూడా కలపాలి. ఇవాళ ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసుకుంటున్నాం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెరిగేలా అనేక చర్యలు చేపట్టాం. ఏఐ, క్వాంటమ్ వ్యాలీ పరిధి రోజు రోజుకూ పెరుగుతోంది. డ్రోన్లు, రోబోటిక్స్, ఐవోటీ, సెన్సార్స్‌ను వాడుకుంటున్నాం. ప్రతిరంగంలోనూ స్పష్టమైన సమాచారం ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించాం. వన్ ఫ్యామిలీ.. వన్ ఆంట్రపెన్యూర్.. అనేది నా లక్ష్యం. నీటి భద్రత విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో నదుల అనుసంధానం చేపట్టాలని ఎప్పటినుంచో కోరుతున్నా. గంగా నుంచి కావేరీ వరకు నదులను అనుసంధానం చేయాలి.
ఏపీకి 1,053 కి.మీ తీరప్రాంతం ఉంది. ఇది మనకు పెద్ద ఆస్తి. ప్రస్తుతం బల్క్ రూపంలోనే 90శాతం కార్గో రవాణా చేస్తున్నాం. ఎయిర్ కార్గో ద్వారా వేగంగా సరకులు పంపిణీ చేయవచ్చు. రైలు కనెక్టవిటీలో ఏపీ చాలా అనుకూలంగా ఉంది. లాజిస్టిక్స్ విషయంలో ఈస్ట్‌కోస్ట్‌లో మనదే అగ్రస్థానం కావాలి. ఇప్పటికే మనకు 6 పోర్టులున్నాయి.. మరికొన్ని పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 2046 నాటికి పోర్టులన్నీ పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రతి 50 కి.మీ దూరానికి ఒక పోర్టు ఉండేలా చూస్తాం. ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలోనూ మంచి వృద్ధి సాధిస్తున్నాం. మన పోర్టుల అభివృద్ధికి సహజసిద్ధ వనరులు ఉన్నాయి. షిప్‌బిల్డింగ్ విషయంలో మనదేశం చాలా వెనుకబడి ఉంది’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎయిర్‌కార్గో వసతులు అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా లాజిస్టిక్ సంస్థల ప్రతినిధులు కోరారు.
CM Chandrababu – ప్రతీ పోర్టుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ – సీఎం చంద్రబాబు
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు, రైలు మార్గాలను అనుసంధానించి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ వ్యవస్థను రూపొందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటితో పాటు అంతర్గత జలరవాణా మార్గాలను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గోదావరి, కృష్ణా నదుల ప్రవాహ మార్గాల్లో దాదాపు 1500 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలను వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాకినాడ-చెన్నైల మధ్య పురాతనమైన బకింగ్ హామ్ కెనాల్ రవాణా మార్గాన్ని పునరుద్ధరిస్తామని సీఎం తెలిపారు. ఈ రవాణా మార్గాలను అనుసంధానించటం ద్వారా అతి తక్కువ రవాణా వ్యయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆపరేషనల్ గా ఉన్న పోర్టులు, కొత్తగా అందుబాటులోకి రానున్న పోర్టులతో రహదారులు, రైలు మార్గాలు, అంతర్గత జలరవాణా, ఎయిర్ కార్గో మార్గాలను అనుసంధానించేలా ప్రతీ పోర్టుకూ కనెక్టివిటి మాస్టర్ ప్లాన్ రూపోందిస్తామని సీఎం వెల్లడించారు. రవాణా పరమైన అంశాలను నిర్వహించేందుకు వీలుగా ఏపీలో త్వరలోనే లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తక్కువ వ్యయంతోనే రైలు, రోడ్డు మార్గాలను పోర్టులకు అనుసంధానించే అవకాశం ఉందని తెలిపారు.
Also Read : Minister Nara Lokesh: ఇంట్లో ‘నాన్న’, పనిలో ‘బాస్’- చంద్రబాబుకు లోకేశ్ విషెస్
