CM Chandrababu Naidu: నేటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ !
నేటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ !
CM Chandrababu: వరద బాధిత కుటుంబాలకు గురువారం నుంచి నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికీ పాలు, బిస్కట్లు, మంచినీరు కూడా అందిస్తామని చెప్పారు. ఇల్లు, దుకాణాలు మునిగి పూర్తిగా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంతో పాటు ప్యాకేజీపైనా ఆలోచిస్తున్నామని తెలిపారు. ‘ఇళ్లలో స్టౌలు, ఫ్రిజ్, ఏసీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు పాడైపోయాయని, తలుపులు, వార్డ్‌రోబ్స్ సహా అన్నీ మరమ్మతులు చేసుకోవాలి. గ్యాస్ సిలిండర్ల రీఫిల్‌పై దృష్టి సారించాం. అగ్నిమాపక యంత్రం ద్వారా ఒక్కో ఇంటి నుంచి బురద తొలగించడానికి 20 నిమిషాలు పడుతోంది. ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 250-300 ఇళ్లు శుభ్రం చేయిస్తాం. 50 అగ్నిమాపక వాహనాలు రాగా, మరో 50కి పైగా తెప్పిస్తున్నామ’ని తెలిపారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఆయన పలు దఫాలు మంత్రులు, అధికారులతో సమీక్షించారు.
CM Chandrababu – నిత్యావసరాల కిట్‌లో ఉండే సరకులు !
25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామోలిన్, 2 కిలోల బంగాళదుంప, 2 కిలోల ఉల్లిగడ్డలు, కిలో చక్కెర. మొబైల్ మార్కెట్ల ద్వారా కూరగాయలను అందిస్తారు. రూ.2, రూ.5, రూ.10 చొప్పున మూడు స్థాయుల్లో రేట్లు నిర్ణయించారు. అన్ని రకాల ఆకుకూరలు రూ.2, రూ.20 లోపు ధర ఉండే కూరగాయలను రూ.5, రూ.20పైన ఉండే కూరగాయలను రూ.10 చొప్పున విక్రయిస్తారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ… కూరగాయలు భారీగా సేకరించాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించాం. దీన్ని సొమ్ము చేసుకునేందుకు ఎవరైనా కూరగాయలు, పాల రేట్లు పెంచితే నిత్యావసరాల చట్టం కింద కేసు పెడతాం. చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించాం. అధికారులు, సచివాలయ సిబ్బంది ఇళ్లలోనూ వస్తువులు పోయాయి. వారూ బాధితులే. అయినా కష్టకాలంలో బాగా పనిచేస్తున్నారు. బాధితులకు ఆహార సరఫరాకు సంబంధించి బుధవారం 72%-82% మధ్య రేటింగ్ వచ్చింది. గురువారం నుంచి క్రమంగా ఆహార సరఫరా తగ్గిస్తాం. దాతలు నాణ్యమైన ఆహారాన్ని లేదా పప్పుధాన్యాలను ఇవ్వాలి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)తో మాట్లాడాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఆహ్వానించా. నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని కోరాను. రాత్రికల్లా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు(CM Chandrababu) ధన్యవాదాలు తెలిపారు. పడవలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవే. కొందరు డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రైవేటు పడవలేమైనా ఉంటే, మేమే డబ్బిస్తాం. ఎవరి నుంచి పైసా తీసుకోవద్దు. ఎక్కడైనా డబ్బు తీసుకుంటే కేసు పెట్టి, అరెస్టు చేయిస్తాం. పెద్దఎత్తున ట్రాక్టర్లను అందుబాటులో ఉంచాం. బయటకొచ్చి నిత్యావసరాల కొనుగోలుకు వీటిని వాడుకోవచ్చు.
సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు ఆర్థికసాయం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా ముందుకొచ్చారు. వారికి అభినందనలు. సీఎస్ సహా 32 మంది ఐఏఎస్‌లు, ఉద్యోగులు బురదలో దిగి పనిచేస్తున్నారు. అదీ మా నిబద్ధత. విజయవాడలోని 179 సచివాలయాలకు సీనియర్ అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించాం.
ఇప్పటిదాకా 9.09 లక్షల ఆహార ప్యాకెట్లు పంచాం. బుధవారం ఉదయం 6 లక్షల ఆహార ప్యాకెట్లు, 8.50 లక్షల నీళ్ల బాటిళ్లు, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కట్ ప్యాకెట్లను అందించాం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 182 ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నాం. స్నానాలకు కుళాయిల ద్వారా నీరిస్తున్నాం. వరద నీరు బయటకు పోయిన ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరిస్తున్నాం. 62 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. గర్భిణుల ఫోన్‌నంబర్లు, లొకేషన్ తీసుకుని, వారిని ఆసుపత్రికి పంపేలా చూస్తున్నాం. 45 డ్రోన్ల ద్వారా సేవలందిస్తున్నాం. 2,100 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాం. రోడ్ల వెంట చెత్త తొలగించేందుకు పొక్లెయిన్లు, టిప్పర్లను సమకూర్చాం. పంట నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించాం. వరదల్లో మరణిస్తే, మృతుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం. మృతదేహాలను మహాప్రస్థానం వాహనాల్లో తెచ్చి పోస్టుమార్టం పూర్తిచేసి, ఇంటికి తరలించాలని ఆదేశించాం. పశువుల మృతదేహాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం !
రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించింది. ‘వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. వరదల నుంచి తక్షణ ఉపశమనం కోసం చేయాల్సిన సాయం, చేపట్టాల్సిన చర్యలపైన కేంద్రానికి సిఫార్సు చేస్తుంది’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) ఎక్స్‌లో పేర్కొన్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ విభాగం అదనపు కార్యదర్శి సంజీవ్‌కుమార్ జిందాల్ నేతృత్వంలో ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలంటూ అమిత్‌షాను సీఎం చంద్రబాబు(CM Chandrababu) బుధవారం ఉదయం ఫోన్‌లో కోరగా సాయంత్రానికి వారు రంగంలోకి దిగారు.
కేంద్ర బృందంలోని సభ్యులు !
1. కె.పి.సింగ్, సలహాదారు (ఆపరేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్), నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ), ఢిల్లీ
2. సిద్ధార్థ మిత్రా, డైరెక్టర్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), ఢిల్లీ
3. ఎం.రమేష్‌కుమార్, ఎస్‌ఈ (కృష్ణా సర్కిల్), సీడబ్ల్యూసీ, హైదరాబాద్
4. ఆర్.గిరిధర్, డైరెక్టర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ), సదరన్ జోన్, చెన్నై
5. వీవీఎన్ ప్రసన్న, కమాండెంట్, 10వ బెటాలియన్, ఎన్‌డీఆర్‌ఎఫ్.
Also Read : Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ !