CM Chandrababu: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్లకు రూ. 15వేలు ఆర్థిక సాయం అందించే విధంగా… విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రారంభించారు. ఈ క్రమంలో ఉండవల్లి నుంచి ఆటోలో సింగ్‌నగర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేరుకున్నారు. అంతకుముందు చంద్రబాబు (CM Chandrababu), పవన్, మాధవ్ కు మంగళగిరి చేనేత కండువాలను కప్పి లోకేశ్ స్వాగతం పలికారు. కూటమి నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున మంగళగిరి ప్రజలు తరలివచ్చారు. బాణసంచా, తీన్‌మార్ డప్పులతో మంగళగిరి యువత సందడి చేశారు.
CM Chandrababu New Innovation
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ… చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని నాయుడు తెలిపారు. ‘‘ విజయవాడ ఉత్సవ్ బ్రహ్మాండంగా జరిగింది. ఓజీ సినిమా చూశారు.. దసరా పండగ చేసుకున్నారు. ఇవాళ ఆటో డ్రైవర్ల పండగలో ఉన్నాం. ఏ కార్యాలయానికి తిరగకుండా ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్న సందర్భమిది. గత ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోలేదు. 2024 ఎన్నికలు నా చరిత్రలో ఎప్పుడూ చూడనిది. 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో గెలిపించారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం మంచి పనులు చేస్తోంది. 15 నెలల మా పాలనలో ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచి ఆదుకుంటున్నాం. పింఛన్ల కోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వమిది. ఇప్పుడు రోడ్లు బాగుపడ్డాయి. ప్రయాణాలకు ఇబ్బంది లేదు. ఉచిత ప్రయాణ సౌకర్యంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయి.
ఆటో డ్రైవర్లలో చాలా మంది పేద వాళ్లే ఉంటారు. ఏడాదికి రూ. 15 వేలు ఇస్తే.. వారికి కొంత ఊరటగా ఉంటుంది. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనా అదే ధోరణి. గతుకుల రోడ్లతో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా ఒకటే హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ గతుకులే గతుకులు.. మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వం. మీకు ఎక్కడా వేధింపులు ఉండవు. జరిమానాల జీవోలను రద్దు చేస్తాం. కానీ, ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. తిరిగేటప్పుడు మీ కదలికలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. ఎలాంటి ఇబ్బందులు సృష్టించొద్దని కోరుతున్నా. అప్పుడు లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. మీ జీవితాలే కాకుండా.. పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.
దుష్ట శక్తులను దరిచేరనీయొద్దు – చంద్రబాబు
‘‘యూనివర్శల్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో అందరినీ ఆదుకుంటాం. పేద ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటున్నాం. రూ. 25 లక్షల వరకు హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టాం. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మంచి చేయడమే మా పని. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. సుమారుగా 750 సేవలను నేరుగా అందిస్తున్నాం. సాంకేతికతను ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం. సంపద సృష్టిస్తున్నాం. అందరికీ అందిస్తున్నాం. సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం సాగుతోంది. జీఎస్టీ సంస్కరణలతో సూపర్ సేవింగ్స్. దసరా, దీపావళి, సూపర్ సిక్స్, సూపర్ జీఎస్టీ. గత ఐదేళ్ల విధ్వంసం నా జీవితంలో చూడలేదు. దుర్మార్గులు రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి శూన్యం. దుష్ట శక్తులు రాకుండా ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని చంద్రబాబు (CM Chandrababu) వ్యాఖ్యానించారు.
జగన్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు – పవన్ కల్యాణ్
జగన్ హయాంలో ఆటోడ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్‌ల కోసం రూ.436 కోట్లు అవుతోందని… ఈ భారాన్ని తమ ప్రభుత్వం ఆనందంగా మోస్తోందని వివరించారు. ఆటోడ్రైవర్ల జీవనోపాధిని కాపాడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇన్ని కష్టాల్లో తమకు సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
స్త్రీశక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు.. ముందుగా ఆటోడ్రైవర్ల గురించే ఆలోచించామని తెలిపారు. ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని వివరించారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా రూ.15వేలు ఆటోడ్రైవర్లకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎంతో ప్రయత్నంచేసి అమలు చేశారని నొక్కిచెప్పారు. సీఎంకి ఆటోడ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఓ ఆటో డ్రైవర్ తనకు వారి సమస్యలను చెప్పారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
Also Read : Hydraa : కొండాపూర్ లో హైడ్రా కూల్చివేతలు
