CM Chandrababu Naidu: భవిష్యత్ లో హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ – సీఎం చంద్రబాబు

భవిష్యత్ లో హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ - సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : గ్లోబల్ వార్మింగ్‌ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్‌కు ప్రాధాన్యం పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) సూచించారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్‌ హైడ్రోజన్‌ సమ్మిట్‌ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు… ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈవోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

CM Chandrababu Naidu Comments

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) మాట్లాడుతూ… ‘‘మీ ఆలోచనలు వినడానికి, ఆవిష్కరణలు తెలుసుకోవడానికే ఇక్కడకు వచ్చాను. విద్యుత్‌ సంస్కరణలు మొదట ప్రారంభించింది నేనే. 1999లో మొదటిసారి అమలు చేశా. సంస్కరణలు అమలు చేసిన కారణంగా అప్పట్లో అధికారం కోల్పోయాం. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్‌ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించాలి. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి. కేంద్రం కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. నీతి ఆయోగ్‌ కూడా దీనిపై దృష్టి సారించింది. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా మారనుంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ, రవాణాకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి.

ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏపీకి ఉన్నాయి. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని బలంగా కోరుకుంటున్నా. గతంలో కరెంటు కూడా సరిగా ఉండేది కాదు. 1995లో శ్రీశైలంలో రివర్స్‌ పంప్‌ విధానం ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించాం. అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ను అధిగమించేందుకు ఉపయోగపడింది. గ్రీన్‌ హైడ్రోజన్‌తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఇవ్వడం సాధ్యమవుతుంది. విశాఖలో కేంద్రం, ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ దిశగా చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలోని తీరప్రాంతంలో ప్రతి 50 కి.మీ ఒక పోర్టు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆలోచన ఏడేళ్ల క్రితం మొదలైంది – వీకే సారస్వత్‌

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆలోచన ఏడేళ్ల క్రితం మొదలైందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సారస్వత్‌ అన్నారు. ప్రస్తుత విద్యుత్‌ తయారీ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు భారీగా విడుదలవుతున్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయాలని, 2047 కల్లా 100 గిగావాట్ల అణువిద్యుత్‌ తయారీని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ‘‘ గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీలోనూ చాలా సవాళ్లు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని చేయనిది గ్రీన్‌ హైడ్రోజన్‌. ప్రపంచ దేశాల్లో దీన్ని క్లీన్‌ హైడ్రోజన్‌గా పిలుస్తున్నారు. ఏపీని గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా మార్చాలని కోరుతున్నా. హైడ్రోజన్‌ ఉత్పత్తి, రవాణా, నిల్వ, ఇంధన తయారీకి ఏపీలో అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ పారిశ్రామిక వేత్తలకు కొదవ లేదు. అమరావతిలో హైడ్రోజన్‌ సిలిండర్ల తయారీ, పరీక్షల యూనిట్‌ ఏర్పాటు చేయొచ్చు.’’ అని సారస్వత్‌ అన్నారు.

Also Read : CM Revanth Reddy: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట

Leave A Reply

Your Email Id will not be published!