CM Chandrababu Naidu: టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు
టీడీపీ నేత వీరయ్య చౌదరికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu : టీడీపీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరిని… ఒంగోలులో తన కార్యాలయంలోనే అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దీనితో ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు… నేరుగా ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు చేరుకుని టీడీపీ(TDP) నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించి… కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
CM Chandrababu Naidu Tributes to TDP Leader
ఈ సందర్భంగా వీరయ్య చౌదరి హత్యపై సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) భావోద్వేగపూరితంగా మాట్లాడారు. వీరయ్య హత్యను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ‘‘నేను దిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. ఈ హత్య జరిగిన విధానం చూస్తే… కరడుగట్టిన నేరస్థులు సైతం చేయని రీతిలో ఉంది. భౌతికకాయంపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా? అనిపిస్తోంది. 12 బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు.
విభేదాలు వచ్చినప్పుడు హత్యలు చేయడం రాక్షస మనస్తత్వం. రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించం. ఈ ఘటనలో నిందితుల గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 9121104784కు చెప్పాలని కార్యకర్తలు, సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని నూటికి నూరు శాతం పట్టుకొని శిక్షిస్తాం. హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు, హత్యలు చేసే వ్యక్తులకు ఒకటే హెచ్చరిస్తున్నా… ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారని గుర్తుంచుకోండి.
వీరయ్య చౌదరి మంచి వ్యక్తి – సీఎం చంద్రబాబు
వీరయ్య చౌదరి(Veeraiah Chowdary) మంచి నాయకుడు, సమర్థమైన వ్యక్తి అని సీఎం చంద్రబాబు కీర్తించారు. యువగళం సమయంలో 100 రోజులు లోకేష్ తో తిరిగారని గుర్తు చేశారు. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలోనూ రైతులకు అండగా నిలబడ్డాడన్నారు. ఎన్నికల సమయంలో చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో వీరయ్య చౌదరి పని చేశారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘోరాలు జరగడం జీర్ణించుకోలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాల నుండి క్లూస్ కూడా తీసుకుంటున్నామని… ఎవరికైనా హత్యపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9121104784 కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సీఎం సూచించారు. హత్యా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా చివరకు కాలగర్భంలో కలిసిపోతారన్నారు.
వీరయ్య చౌదరి భార్య, కుమారుడితో మాట్లాడుతుంటే… అసలు వాళ్లకు ఏమీ తెలియదు. ఆయన మిత్రులు, బంధువులతో, డ్రైవర్ తో మాట్లాడాను. ఈ ఘటన జరిగినప్పుడు ఆఫీస్ లో ఆయనతో పాటు ఉన్న వ్యక్తినీ మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఎవరూ గుర్తు పట్టకుండా నిందితులు ముసుగు వేసుకొని ఈ కిరాతకానికి ఒడిగట్టారు. ఏది ఏమైనా నిందితుల్ని పట్టుకొని శిక్షించి… వీరయ్య చౌదరి ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాం. ఈ ఘటనకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా ఇవ్వండి. ఎవరినీ వదిలిపెట్టం. దొరికే వరకూ గాలిస్తాం. నిందితుల్ని పట్టుకొనే వరకు దర్యాప్తు కొనసాగుతుంది.
పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా, అధైర్యపడొద్దు
వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటాం. ఆదుకుంటాం. మా కుటుంబ సభ్యుల మాదిరిగానే చూసుకుంటాం. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా. మీకు అండగా ఉంటాను. ఇలాంటి దుర్మార్గులు, నేర రాజకీయాలు చేసేవారిని తుదముట్టించేంత వరకు ఈ పోరాటం ఆగదు. రాష్ట్రంలో గత ఐదేళ్లు చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపించింది. హత్యలు చేయడం నీచమైన, దుర్మార్గమైన చర్య. ఈ హత్యోదంతాన్ని ఛేదించే వరకు పోలీస్ వ్యవస్థ నిద్రపోదు. నిందితుల్ని పట్టుకుంటాం. శిక్షిస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read : Simhachalam: ఈ నెల 30 సింహాచలం అప్పన్న స్వామి నిజరూపదర్శనం !