CM Chandrababu Naidu: ఒంటిమిట్ట స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
ఒంటిమిట్ట స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
CM Chandrababu Naidu : ఆంధ్రా భద్రాద్రి… కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో కొలువు తీరిన శ్రీసీతారామచంద్రమూర్తికి… సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) దంపతులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతోపాటు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత స్వామి వారి ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు దంపతులకు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులను వేద పండితుల ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్వామి వారి కళ్యాణాన్ని సీఎం దంపతులు వీక్షించారు.
టీటీడీ(TTD) బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వామి వారి కళ్యాణం ప్రారంభమైంది. ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా ఒంటిమిట్టకు చేరుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో… అందుకు తగట్లుగా టీటీడీ(TTD), రాష్ట్ర దేవాదాయ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలను చేపట్టాయి. అలాగే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం రాత్రికి సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోనే బస చేసారు. శనివారం ఉదయం 9.00 గంటలకు ఒంటిమిట్ట నుంచి నేరుగా కడప విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్నారు.
CM Chandrababu Naidu – ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం తేవాలనేదే నా ఆకాంక్ష – సీఎం చంద్రబాబు
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న అనంతరం భక్తులను ఉద్దేశ్యించి ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu Naidu) మాట్లాడుతూ… ‘‘ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని జరుపుకొన్నాం. వారిద్దరిదీ ఆదర్శ దాంపత్యం. పరిపాలన అంటే సాక్షాత్తూ శ్రీరాముడి పాలన గుర్తుకురావాలి. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో రాములోరి దర్శనం చేసుకొనేవాళ్లం. అక్కడే వైభవంగా కల్యాణం జరిపేవాళ్లం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఒంటిమిట్టలో అత్యంత వైభవంగా కోదండరాముడి కల్యాణాన్ని జరపాలని ప్రభుత్వపరంగా ఆదేశాలు జారీ చేశాం. అప్పటినుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. అభివృద్ధిలో భాగంగానే ఒంటిమిట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోకి తీసుకొచ్చాం. ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఆలయం పక్కనే ఉన్న చెరువు బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభించాం. ఇక్కడికి ఎవరు వచ్చినా రెండు మూడు రోజలు ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దేవాలయాలు మన వారసత్వ సంపద. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. దేవాలయాలు లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని గొప్ప వారసత్వ సంపద భారతదేశానికి ఉంది. ఇలాంటి గొప్ప వారసత్వ సంపదను మన భవిష్యత్ తరాలకు అందించాలి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ 1 లేదా నంబర్ 2 దేశంగా అభివృద్ధి చెందుతుంది. నా ఆలోచన ఒక్కటే. నా దృష్టిలో రామరాజ్యం అంటే… ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకోవడమే. స్వర్ణాంధ్రప్రదేశ్‌లో పేదరికం అనేది ఉండకూడదు. ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి. రాష్ట్ర ప్రజల సహకారంతో పేదరికం లేదని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాను. ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం తేవాలనేదే నా ఆకాంక్ష. శ్రీరాముడి స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేయాలనేదే తన ధ్యేయం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read : Gorantla Madhav : మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్