CM Chandrababu: యోగా డే సూపర్ హిట్ – ముఖ్యమంత్రి చంద్రబాబు

యోగా డే సూపర్ హిట్ - ముఖ్యమంత్రి చంద్రబాబు

CM Chandrababu : విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. ఉదయం 6 గంటలకు యోగా చేసే ప్రదేశానికి రావాలని ఔత్సాహికులకు పిలుపునిస్తే తెల్లవారు 2 గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారని అన్నారు. కార్యక్రమం నిర్వహణకు ప్రకృతి సహకరించడంతో పాటు వరుణదేవుడు కూడా కరుణించాడని తెలిపారు. యోగా చేయాలనుకున్న చోటుకు 3,03,654 మంది క్యూఆర్ కోడ్ తో వచ్చారని వెల్లడించారు. ఒకే వేదిక వద్ద 3 లక్షల మందికి పైగా యోగా (Yoga) చేయటం, 22,122 మంది గిరజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండు గిన్నీస్ రికార్డులు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించామని వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనంతరం విశాఖపట్నం కలెక్టరేట్ లో మంత్రులు, అధికారులతో కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ…‘‘యోగా డే లో పాల్గొనేందుకు 2.45 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 20 లక్షల మందికి ధృవపత్రాలు ఇవ్వాలనుకున్నాం కానీ 1.80 లక్షల దాకా సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు. యోగా(Yoga) పట్ల ప్రజల్లో అవగాహన లేకపోయినా, లాభం లేదని భావించినా కార్యక్రమానికి రారు. యోగాతో ఉపయోగం ఉందని భావించటం వల్లే తెల్లవారు ఝామున 2 గంటల నుంచి రావడం ప్రారంభించారు. పదేళ్లుగా ప్రధాని మోదీ చేసిన కృషి ఫలించింది. 170 దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల చోట్ల 10 కోట్ల మంది ప్రజలు యోగాలో భాగస్వామ్యయ్యారు. యోగా కొందరిది కాదు..అందరిదీ. యోగా ప్రతీ ఒక్కరికీ అవసరమే అనే భావనను ప్రధాని మోదీ తీసుకొచ్చారు.’ అని సీఎం చంద్రబాబు కొనియాడారు.

CM Chandrababu – నాడు దీపావళి వద్దంటే మానేశారు ! నేడు యోగాడేకి రమ్మంటే తరలి వచ్చారు !

యోగా దినోత్సవాన్ని (Yoga Day) విజయవంతం చేయడానికి మంత్రులంతా బాగా పనిచేశారని సీఎం ప్రశంసించారు. ‘‘అధికార యంత్రాంగం, విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా కలెక్టర్ సహా ప్రతి ఒక్కరూ కృత నిశ్చయంతో చిన్నపాటి ఇబ్బంది కూడా రాకుండా ఏర్పాట్లు చేశారు. టెక్నాలజీ ఉపయోగించి, కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించారు. ప్రజాప్రతినిధులు సంఘీభావంగా పని చేశారు. విశాఖపట్నం అంటే నాకు అమితమైన అభిమానం. విశాఖ కలెక్టరేట్ తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఇక్కడే ఉన్నాను. తుఫాన్ ధాటికి చెట్లన్నీ పడిపోయి అప్పుడు నగరం కళావిహీనంగా మారింది. ఆ సమయంలో 11 రోజుల పాటు ఇక్కడే ఉండి సాధారణ స్థితికి తీసుకొచ్చాను.

ఇలాంటి సమయాల్లో ప్రజలు బాధలో ఉండి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉంటారని, చంద్రబాబు ఆదుకుంటారు అనే నమ్మకంతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారని.. తాను రెండు సార్లు సీఎంగా పనిచేసినా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని గతంలో ప్రధాని మోదీ నాతో అన్న మాటలు జీవితంలో మర్చిపోలేను. దీపావళి రోజున టపాసులు కాల్చ వద్దని పిలుపునిస్తే ఒక్క టపాసు కూడా విశాఖలో పేలలేదు. యోగాలో (Yoga) పాల్గొనాలని నిన్న పిలుపునిస్తే అర్థరాత్రి 2 గంటల నుంచే వచ్చేశారు. నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దీపావళి చేయొద్దంటే మానేశారు. ఇవాళ యోగాడే కి రావాలని విజ్ఞప్తి చేస్తే తరలి వచ్చారు.’ అని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

CM Chandrababu : గిరిజన విద్యార్థులను అభినందిస్తున్నా – చంద్రబాబు

22,122 మంది 108 నిమిషాల పాటు సామూహికంగా సూర్య నమస్కారం చేసి గిన్నీస్ రికార్డు సాధించిన గిరిజన విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 26 థీమ్ ఆధారిత యోగా కార్యక్రమాలు చేపట్టాం. 100 పర్యాటక ప్రాంతాల్లో యోగా చేయాలనుకుంటే 101 చోట్ల నిర్వహించాం. సూరత్‌లో 1.47 లక్షల మందితో యోగా చేసి గిన్నీస్ రికార్డ్ సాధిస్తే…నేడు 3 లక్షలమంది పైచిలుకు మందితో యోగా డే నిర్వహించాం. రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా సాధన చేశారు. మొత్తంగా 2.17 కోట్ల మంది పాల్గొన్నారు. 1.44 లక్షల మంది యోగా శిక్షకులు తయారయ్యారు. కేంద్రం కూడా ప్రమోట్ చేసేందుకు 5 లక్షల టీ షర్టులు, మ్యాట్లు 5 లక్షలు రాష్ట్రానికి పంపించింది.

మంచి కార్యక్రమాన్ని 30 రోజుల పాటు పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినందుకు మీడియా ప్రతినిధులను అభినందిస్తున్నాను. యోగాడే స్పూర్తిగా విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం. యోగా ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఈ ఏడాది ఆరోగ్య శాఖకు రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.5 వేలకోట్లకు పైగా ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవకు ఖర్చు చేస్తున్నాం.’ అని సీఎం అన్నారు.

ఆర్గానిక్ ఆహారం తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేదు

‘ప్రస్తుతం రసాయనాలు ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నామని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ రాష్ట్రం వ్యవసాయంలో ఎక్కువ పురుగుమందులు వాడటంతో క్యాన్సర్ రోగులు పెరిగి ప్రతిరోజూ ఢిల్లీకి వైద్యం కోసం ప్రత్యేక రైలులో వస్తున్నారని అన్నారు. ‘‘కాలు విరిగినా, గుండె ఆపరేషన్ చేయించినా శరీరం డ్యామేజ్ అవుతుంది. అందుకే రోజులో ఒక గంట పాటు మీ కోసం యోగా చేయండి. మీ కుటుంబానికి, రాష్ట్రానికి కూడా భారం కాకుండా ఉంటారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఇంట్లో వారికి అది భారం అవుతుంది. సమాజంలో అంతా ఆరోగ్యంగా ఉంటే ప్రభుత్వం కూడా ప్రజారోగ్యంపై ఎక్కువ వ్యయం చేయాల్సిన అవసరం ఉండదు.

యోగా ను ప్రోత్సహించేలా కార్యాచరణ చేపడతాం. వైద్యారోగ్యం, వ్యవసాయ రంగాల్లో బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ హెల్త్ రికార్డులు తయారుచేస్తున్నాం. యోగా, నేచురోపతి గేమ్ ఛేంజర్ అవుతుంది. గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛ భారత్, నేచురల్ ఫార్మింగ్ ద్వారా ప్రకృతిని కాపాడవచ్చు. యోగాపై నేను, డిప్యూటీ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని కార్యక్రమాన్ని పర్యవేక్షించాం. కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రధాని కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. యోగా జీవితంలో ఉపయోపడుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఆయిల్ వాడకం, ఉప్పు తినడం తగ్గించాలి. ఆర్గానిక్ ఆహారాన్ని అలవాటు చేసుకుంటే ప్రజలు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.’ అని ముఖ్యమంత్రి వివరించారు.

కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు ముఖ్యమంత్రి ప్రశంస

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల క్రతువును అత్యంత విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఆయన కృషిని, ప్రణాళికను అభినందించారు. యోగా వేడుకల అనంతరం కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమ నిర్వహణలో అధికార యంత్రాంగం కీలక పాత్ర పోషించిందని, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శక్తివంచన లేకుండా కృషి చేశారని కితాబిచ్చారు. వేడుకల నిర్వహణలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయం వహించారని, ఫలితంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని పేర్కొన్నారు.

Also Read : PM Narendra Modi: యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది – ప్రధాని మోదీ

Leave A Reply

Your Email Id will not be published!