యుద్ద ప్రాతిప‌దిక‌న నీటి పారుద‌ల ప్రాజెక్టులు

పూర్తి చేయాల‌ని ఆదేశించిన సీఎం చంద్ర‌బాబు

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా నీటి పారుద‌ల రంగంపై ఎక్కువ‌గా దృష్టి సారించారు. యుద్ద ప్రాతిప‌దిక‌న నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇదే స‌ర్కార్ ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

ఇదే సమయంలో సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని చంద్ర‌బాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. చాలా వరకు ప్రాజెక్టులను పెండింగులో పెట్టేసిందని మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. 10 జిల్లాల పరిధిలో ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని, అలాగే తక్కువ నిధులను కేటాయిస్తే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను తొలుత చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకు పోయిన అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు.

గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ దిశగా సుమారు 20కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు, అలాగే 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీళ్లు అందించవచ్చని అధికారులు సీఎంకు తెలిపారు. సీమ ప్రాజెక్టులతో పాటు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తి అయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లవచ్చన్నారు. అప్పుడు పోలవరం-వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టవచ్చని సూచించారు. ఈలోగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రాధాన్యతల వారీగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!