CM Chandrababu : రజనీకాంత్ 50 ఏళ్ళ సినీ ప్రయాణంపై చంద్రబాబు, పవన్ రియాక్షన్స్

రజనీకాంత్ 50 ఏళ్ళ సినీ ప్రయాణంపై చంద్రబాబు, పవన్ రియాక్షన్స్

CM Chandrababu : చలన చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అద్భుతమైన కెరీర్‌లో రజనీ తన ఐకానిక్ నటనతో లక్షలాది మందిని అలరించడమే కాకుండా, సామాజిక అవగాహన పెంచడానికి తన చిత్రాలను ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. రజనీ మాటలు సామాజిక సమస్యలపై ప్రతిబింబించడానికి ప్రేరణనిచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన సందేశాలు లెక్కలేనన్ని జీవితాలను తాకాయని చెప్పుకొచ్చారు. రజనీ నడకలో, సంభాషణలు పలకడంలో, హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రజనీకాంత్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సీఎం చంద్రబాబు ట్వీట్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్‌ స్పందించారు. చంద్రబాబు (CM Chandrababu) మాటలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తనను నిజంగా కదిలించాయని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. మీ దయగల సందేశం చాలా అర్థమైందని తెలిపారు. మీలాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో.. సినిమా ద్వారా తన ఉత్తమమైన సందేశాలను అందిస్తానని రజనీ పేర్కొన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రజనీ.

CM Chandrababu – సూపర్ స్టార్ రజనీకాంత్ కి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఈ సందర్భంగా ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తరాలు మారుతున్నా రజనీకాంత్ అంటే… సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదని చెప్పారు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజనీకాంత్ అని కొనియాడారు. నటుడిగా 5 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారని ప్రశంసించారు.

వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజనీ’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మార్మోగుతుందో పలుమార్లు తాను చెన్నైలో చూశానని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతినాయక పాత్ర పోషించినా.. కథానాయకుడిగా మెప్పించినా రజనీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారంటూ ప్రశంసించారు.

రజనీ నడకలో… సంభాషణలు పలకడంలో… హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారని పేర్కొన్నారు. రజనీకాంత్ స్టైల్స్‌కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారన్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజనీకాంత్ మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలు, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం… ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియజేస్తుందని తెలిపారు.

నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని తాను ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు పవన్. రజనీకాంత్‌కి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read : Localbody Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై తేలేది పీఏసీలోనే

Leave A Reply

Your Email Id will not be published!