CM Chandrababu: సింగపూర్ లో రెండో రోజు బిజీ బిజీగా సీఎం చంద్రబాబు
సింగపూర్ లో రెండో రోజు బిజీ బిజీగా సీఎం చంద్రబాబు
CM Chandrababu : సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు రెండో రోజు బిజీ బిజీగా గడిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా టువాస్ పోర్టును సీఎం చంద్రబాబు నాయుడు బృందం సందర్శించింది. ఆ క్రమంలో పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజినల్ సీఈవో విన్సెంట్‌తో సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్ట్‌గా టువాస్ పోర్టును నిర్మిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు సింగపూర్ అథారిటీ అధికారులు వివరించారు. అనంతరం ఆ పోర్టులోని ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను సీఎం చంద్రబాబుతోపాటు ప్రతినిధి బృందం పరిశీలించింది.
CM Chandrababu in Singapore
పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక కారిడార్లతో ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలో టువాస్ పోర్టు అనుసరిస్తున్న విధానాలు ఎంత వరకు ఉపయోగపడతాయనే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) బృందం అధ్యయనం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ పోర్టు ఆధారిత పరిశ్రమలు, కార్యాకలాపాలు, నిర్వహణపై టువాస్ పోర్టు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని పోర్టులను సింగపూర్ (Singapore) భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే అవకాశాలపై ఆ దేశ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ టువాస్ పోర్టును సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పి. నారాయణ, టీజీ భరత్‌తోపాటు పలువురు అధికారులు సందర్శించారు.
బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌లో భాగంగా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జులై 26 నుంచి 31వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశం అవుతున్నారు. ఆ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పారిశ్రామిక పాలసీ, భూమి లభ్యత తదితర అంశాలను వారికి సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించనున్నారు. అందులో భాగంగా వారిని ఏపీకి ఆహ్వానించనున్నారు.
ఇక ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు విదేశీ పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సైతం నిర్వహించనున్నారు. సింగపూర్‌లో నిర్వహించే రోడ్ షోకు ఆయన హాజరవుతారు. అదే విధంగా ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సంస్థలను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట.. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
సింగపూర్ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం – చంద్రబాబు
సింగపూర్ ప్రభుత్వంతో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్‌లో పర్యటిస్తోన్న ఆయన సోమవారం ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరంలో పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ఉత్తమ విధానాలైనా సింగపూర్ నుంచే వస్తున్నాయని అన్నారు. ‘‘స్వాతంత్ర్యం తర్వాత మన నాయకులు మిళిత, సోషలిస్టు ఆర్థిక విధానాలు అవలంబించారు. 1947లోనే ఆర్థిక విధానాల్లో పోటీపడి ఉంటే భారత్ ఇప్పుడు ఎలా ఉండేదో ఆలోచించండి. ఎట్టకేలకు 1991లో ఆర్థిక సంస్కరణల బాట పట్టింది. భారత్ సంస్కరణలు చేపట్టిన 13 ఏళ్లకు చైనా అదే విధానం అవలంబించింది. 2014లో ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం ఇక్కడికి వచ్చా. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే మళ్లీ వచ్చాను.
నేను తొలిసారి సీఎం అయినప్పుడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో సింగపూర్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయాలని కోరా. ఇప్పుడు ఏపీలో సింగపూర్ మాదిరిగా నగరాన్ని నిర్మించాలని సంకల్పించా. ఉచితంగా రాజధాని మాస్టర్‌ప్లాన్ ఇచ్చేందుకు సింగపూర్ ముందుకు వచ్చింది. అభివృద్ధిలో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. అదే బాటలో ఏపీ కూడా పయనించాల్సి ఉంది. పెట్టుబడులకు ఇక్కడి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి. మేం సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి పెట్టాం. నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. దీనికి సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా’’అని చెప్పారు.
Also Read : Instagram Lover : ఇన్ స్టా ప్రియుడి కోసం బిడ్డను బస్‌స్టాండ్‌లో వదిలేసిన తల్లి
