CM Chandrababu: కుప్పంలో చంద్రబాబు పర్యటన ! కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం !

కుప్పంలో చంద్రబాబు పర్యటన ! కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం !

CM Chandrababu : సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో (Kuppam) శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. కుప్పంలో ‘స్త్రీ శక్తి’ బస్సులో మహిళలు, రైతులతో కలిసి ప్రయాణించారు. ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఆయనను చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

CM Chandrababu – కుప్పం ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబు సమక్షంలో 6 ఒప్పందాలు

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సమక్షంలో 6 అవగాహన ఒప్పందాలు జరిగాయి. కుప్పం పరిధిలో వ్యర్థాల నుంచి సంపద కార్యక్రమం అమలు కోసం ఏజీఎస్‌-ఐటీసీతో ఒప్పందం చేసుకుంది. వ్యర్థాల సుస్థిర నిర్వహణపై ఇంటింటి ప్రచారం, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను 15 ఏళ్లపాటు నిర్వహించనుంది. కుప్పంలో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయటం, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌ అంశాలపై షీలీడ్స్‌ సంస్థతో ఒప్పందం కుదిరింది. నియోజకవర్గంలోని 10వేల మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంతో పాటు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇవ్వనున్నారు. కుప్పంలో ఫైబర్‌ బోర్డు ఉత్పత్తికోసం కింగ్స్‌ వుడ్‌ డెకార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో మరో ఎంవోయూ చేసుకున్నారు. ఈ సంస్థ రూ.1100 కోట్ల పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డును ఉత్పత్తి చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 2,012 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.

కుప్పంలో 2 సీటర్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. రూ.150 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 70 నుంచి 100 శిక్షణకు ఉపయోగించే 2 సీటర్ విమానాలను ఈ సంస్థ తయారు చేయనుంది. 250 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు పయనీర్‌ సంస్థ తెలిపింది. బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ఎత్రెయాల్ ఎక్ప్ ప్లోరేషన్ గిల్డ్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదిరింది.

మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ రేజర్ క్రెస్ట్ ఎంకె-1 తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎత్రెయాల్‌ సంస్థ అవగాహనా ఒప్పందం చేసుకుంది.  రూ.500 కోట్ల పెట్టుబడిని మూడు దశల్లో పెట్టేలా కార్యాచరణ రూపొందించారు. మొత్తం 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్‌తో ఒప్పందం జరిగింది. రూ.300 కోట్ల పెట్టుబడితో 15 వేల మందికి ఉపాధి కల్పించేలా ఈ సంస్థ ప్రతిపాదన సమర్పించింది. మామిడి, జామ, టమాటో పల్పింగ్ యూనిట్లను రెడ్‌ బెర్రీ సంస్థ ఏర్పాటు చేయనుంది.

Also Read : Pawan Kalyan: మండల స్థాయి వరకు పార్టీను మానిటర్ చేస్తా – పవన్ కల్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!