CM Chandrababu: సింగపూర్ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుంది – సీఎం చంద్రబాబు
సింగపూర్ పెట్టుబడులకు ఏపీ గేట్‌వేగా ఉంటుంది - సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు… సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వంతో పాటు… వివిధ అంతర్జాతీయ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ (Singapore) లోని భారత హైకమిషనర్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ తో రాజధాని అమరావతి నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదని తన పర్యటనలో కొన్ని రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు… భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను సీఎం వివరించారు.
CM Chandrababu Key Comments on Investments
గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే పట్టాలెక్కాయని తెలిపారు. ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) ఏర్పాటు అవుతుందన్న చంద్రబాబు (CM Chandrababu)… డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలని, వాటికి ఏపీ గేట్ వేగా ఉంటుందని స్పష్టంచేశారు. సింగపూర్‌లో 83 శాతం పబ్లిక్ హౌసింగ్ అని హైకమిషనర్ వివరించారు.
ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవసరమైన సహకారన్ని అందించాలని కోరారు. విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తమ ఆలోచనలను మంత్రి లోకేశ్ వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి వివరించారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇండియాతో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని శిల్పక్ అంబులే తెలిపారు. భారత్‌లో ప్రత్యేకించి ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని హైకమిషనర్ వ్యాఖ్యానించారు.
గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలనే సింగపూర్ వచ్చా – సీఎం చంద్రబాబు
సింగపూర్ (Singapore) ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్ లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా… తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. ‘‘టీడీపీ హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజినీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయి. పెద్దఎత్తున ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పీవీ నరసింహారావు.
భవిష్యత్తు అంతా ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మా. నాలెడ్జ్ ఎకానమీలో తెలగుజాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించా. సింగపూర్ లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణం. ప్రపంచంలో 120కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగింది. సింగపూర్‌లో 40వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉంది. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. 2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ (AP) నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పా. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చా’’ అని చంద్రబాబు వివరించారు.
తెలుగుజాతి కోసం పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా – లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారున్నారంటే ఆ క్రెడిట్ చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు శాసించేందుకు ఆయన విజనరీ కారణమని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30లక్షల మంది తెలుగు ప్రజలు ఉన్నారని లోకేశ్ తెలిపారు. ‘‘రాష్ట్రంలో రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితుల గురించి నా కంటే మీకే బాగా తెలుసు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంస పాలన చూశాం.
ఎన్నికల సమయంలో కొందరు దాదాపు 6 నెలలు ఏపీకి వచ్చి కష్టపడ్డారు. రాష్ట్రాన్ని దారిలో పెట్టే విషయంలో కష్టపడినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గతంలో చంద్రబాబు అరెస్టయినపుడు ఇదంతా మనకు అవసరమా అని బ్రాహ్మణి అడిగింది. అదే సమయంలో హైదరాబాద్‌లో 45వేల మంది ఐటీ నిపుణులు చంద్రబాబు వెంట ఉంటామని చెప్పారు. ఐటీ నిపుణులు అండగా నిలబడ్డారు… అదే మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిచేందుకు కష్టపడాలని ఆరోజే నిర్ణయించుకున్నా. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో సింగపూర్‌ను రోల్ మోడల్‌గా తీసుకుంటున్నాం’’ అని లోకేశ్ తెలిపారు.
Also Read : Supreme Court: సీబీఐకి విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని కేసు
