CM Devendra Fadnavis: నాగ్ పూర్ అల్లర్లకు “ఛావా” సినిమానే కారణం – సీఎం ఫడ్నవిస్
నాగ్ పూర్ అల్లర్లకు "ఛావా" సినిమానే కారణం - సీఎం ఫడ్నవిస్
Devendra Fadnavis : మహారాష్ట్రలోని నాగపూర్ లో నెలకొన్న ఉద్రిక్తతలకు ఒక రకంగా ‘ఛావా’ సినిమానే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis) అన్నారు. మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తో మొదలైన ఆందోళన… హింసాత్మకంగా మారి… నాగ్ పూర్ లో పలు చోట్ల నెలకొన్న కర్ఫ్యూ పరిస్థితులపై ఆయన అసెంబ్లీలో కీలక విషయాలు వెల్లడించారు.
CM Devendra Fadnavis Comment
ఇక్కడ నేను కేవలం ఒక సినిమాను మాత్రమే తప్పుపట్టాలని అనుకోవడం లేదు. కానీ, ఇలా మాట్లాడక తప్పడం లేదు. శంభాజీ మహరాజ్ చరిత్రను ఛావా చిత్రం ప్రజల ముందు ఉంచింది. అదే సమయంలో పలువురి మనోభావాలు రగిలిపోయాయి. అందుకే ఔరంగజేబు మీద వ్యతిరేకత అంశం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది అని అన్నారు.
ఇదంతా పక్కా ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని సీఎం ఫడ్నవిస్(Devendra Fadnavis) అనుమానాలు వ్యక్తం చేశారు. ఔరంగజేబు సమాధి తొలగించాలనే డిమాండ్ తో సోమవారం సాయంత్రం వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ధర్నా చేపట్టాయి. కర్రలతో ఔరంగజేబు నకిలీ సమాధి ఒకదానిని ఏర్పాటు చేసి తగలపెట్టారు. అయితే ఇది జరిగిన కాసేపటికే మతపరమైన ప్రతులు తగలబెట్టారని ప్రచారం రేగింది. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాబట్టి ఇందులో కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు అని అన్నారాయన.
అయితే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని… కులం, మతం ఏదైనా సరే ప్రజలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించారాయన. అదే సమయంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవాళ్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయంతో పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి నాగ్‌పూర్ లో భారీ ఎత్తున విధ్వంస కాండ జరిగింది. రాళ్లు రువ్వుకుంటూ… పలు వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు… పోలీసుపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడుల్ల 33 మంది పోలీసులకు పైగా గాయాలైనట్లు సమాచారం. అయితే సాధారణ పౌరులు ఎంత మంది గాయపడ్డారనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇది ఇలా ఉండగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రంలో లీడ్ రోల్ శంభాజీగా విక్కీ కౌశల్, శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా తమ ఫెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ టైంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తారు. మరాఠా యోధుడు శంభాజీ పోరాటాన్ని, త్యాగాన్ని ఇప్పటి తరానికి తెలియజేసిన ఈ చిత్రం నిజంగా ఓ అద్భుతమంటూ కొనియాడారు.
Also Read : Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్నల్