CM Hemant Soren: అజ్ఞాతంలో జార్ఖండ్ సీఎం ? ఆశక్తికరంగా జార్ఖండ్ రాజకీయాలు !

అజ్ఞాతంలో జార్ఖండ్ సీఎం ? ఆశక్తికరంగా జార్ఖండ్ రాజకీయాలు !

CM Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్(CM Hemant Soren) ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో… సుమారు 18 గంటల పాటు ఈడీ స్క్వాడ్ అక్కడ వేచిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ సీఎం సోరెన్ బటయకు రాకపోవడంతో ఈడీ బృందం… హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్‌ తో ఒక బీఎండబ్ల్యూ కారుతో పాటు కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీనితో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యను సీఎం హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్రగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభివర్ణించగా… అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర శాఖ ఆరోపిస్తోంది.

భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ సమన్లు ​​జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఏజెన్సీకి లేఖ పంపారని, అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈడీకి పంపిన ఈ మెయిల్ లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోరెన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం సోరెన్(CM Hemant Soren) జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఆయన పార్టీ జేఎంఎం తెలిపింది.

అయితే సీఎం సోరెన్ అధికారిక నివాసానికి వెళ్లిన ఈడీ బృందానికి… సోరెన్ ఆచూకీ లేకపోవడంతో ఓ బీఎండబ్యూ కారును, కీలకపత్రాలు కలిగిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సీఎం సోరెన్ ఎక్కడున్నారన్నది తెలియడం లేదని… రాంచీ నుంచి ఆయన ప్రయాణించిన ప్రైవేటు విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో పార్క్‌ చేసి ఉన్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. దీనితో అరెస్టు భయంతో సీఎం సోరెన్ పరారయ్యారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

CM Hemant Soren – ఆశక్తికరంగా జార్ఖండ్ రాజకీయాలు ! సోరెన్‌ సతీమణికి సీఎం పగ్గాలు ?

భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఆశక్తికరంగా మారుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో సీఎం సోరెన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో… త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని ఆదేశాలు రావడం… ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం వీరంతా సీఎం నివాసంలో సమావేశం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్‌ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపాయి. దీనితో సీఎం మార్పు జరగనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. అంతేకాదు సోరెన్‌ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే మాట్లాడుతూ ‘‘హేమంత్‌ సోరెన్‌జీ తన ఎమ్మెల్యేలను రాంచీకి పిలిచారు. మాకు అందిన సమాచారం ప్రకారం.. హేమంత్‌(CM Hemant Soren) తన సతీమణి కల్పనా సోరెన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈడీ విచారణతో సీఎం భయపడుతున్నారు. తాను రోడ్డు మార్గంలో దిల్లీ నుంచి రాంచీకి వస్తానని తన పార్టీ నేతలకు సోరెన్‌ చెప్పినట్లు తెలిసింది’’ అంటూ దూబే తన సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : Imam Umer Ahmed Ilyasi: అయోధ్య వెళ్లినందుకు ముస్లిం మతగురువుకు బెదిరింపులు !

Leave A Reply

Your Email Id will not be published!