CM Mamata Banerjee: బీజేపీపై సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
బీజేపీపై సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి కుట్ర చేస్తున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి బెంగాలీలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తృణమూల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని బెంగాలీ ప్రజలను వేధిస్తున్నారని, నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి బీజేపీను గద్దె దించేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని బెంగాల్ ప్రజలు ఎందుకు వేధింపులకు గురవుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
CM Mamata Banerjee Sensational Allegations on BJP
‘‘ప్రధానంగా భాజపా పాలిత రాష్ట్రాల్లోని మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. బెంగాల్‌లో అధికార మార్పిడి జరిగితే అభివృద్ధి ఏంటో చూపిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. గత 11 ఏళ్లలో దేశానికి ఆ పార్టీ చేసిందేంటి ? బెంగాల్ ప్రజలను, వారి భాషను బీజేపీ తక్కువ చేసి చూస్తోంది. ఇది ఆగకపోతే.. మా ప్రతిఘటన దిల్లీకి వినిపిస్తుంది. బెంగాల్ భాషపై బీజేపీ వివక్షకు నిరసనగా జులై 27 నుంచి భాషా ఉద్యమం చేపట్టబోతున్నాం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలవాలి. ఆ తర్వాత దిల్లీ పీఠాన్ని కదిలించేందుకు బయల్దేరి వెళ్దాం.
గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఎమర్జెన్సీ గురించి బీజేపీ తరచూ ప్రస్తావిస్తుంటుంది. కానీ, అంతకు మించి ‘సూపర్ ఎమర్జెన్సీ’ని కమలం పార్టీ అమలు చేస్తోంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో ప్రస్తుతం బిహార్‌లో బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇదే విధానాన్ని పశ్చిమబెంగాల్‌లోనూ చేపడతామంటే కుదరదు. కచ్చితంగా వ్యతిరేకిస్తాం. వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం. రాష్ట్రంలోకి వారిని అనుమతించే అవకాశమే లేదు’’ అని మమత తేల్చి చెప్పారు.
Also Read : Justice Yashwant Varma: జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ఎంపీల నోటీసు
