CM Mamata Banerjee : బెంగాల్ పై కేంద్రం చూపుతున్న వివక్షను నీతి ఆయోగ్ లో నిలదీస్తాను
శనివారంనాడు ఢిల్లీలో జరిగే ''నీతి ఆయోగ్'' సమావేశంలో పశ్చిమబెంగాల్ పట్ల చూపుతున్న..
CM Mamata Banerjee : కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు కేటాయింపుల్లో ‘వివక్ష’ చూపారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలు ఈసారి ‘నీతి ఆయోగ్’ లో ఆ విషయాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. శనివారంనాడు ఢిల్లీలో జరిగే ”నీతి ఆయోగ్” సమావేశంలో పశ్చిమబెంగాల్ పట్ల చూపుతున్న రాజకీయ వివక్షపై నిరసన తెలపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) చెప్పారు. ఢిల్లీకి శుక్రవారం బయలుదేరే ముందు మీడియాతో ఆమె మాట్లాడారు.
CM Mamata Banerjee Comment
”బెంగాల్ పట్ల చూపిస్తున్న రాజకీయ వివక్షపై నీతి ఆయోగ్‌లో నిరసన తెలియజేస్తాను. కేంద్ర బడ్జెట్లో బెంగాల్, ఇతర విపక్ష రాష్ట్రాల పట్ల వివక్ష చూపారు. దీనిని మేము అంగీకరించం” అని మమత తెలిపారు. ఆర్థిక, భౌగోళిక అవరోధాలు సృష్టించడం ద్వారా బెంగాల్‌ను విడగొట్టాలన్నదే బీజేపీ మంత్రులు, నేతల ఆలోచన అని ఆమె ఆరోపించారు. ఒకవైపు పార్లమెంటు జరుగుతుండగా జార్ఖాండ్, బీహార్, అసోం, బెంగాల్‌ను విడగొడతామంటూ భిన్న నాయకులు భిన్న ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ధోరణులను తాము గట్టిగా ఖండిస్తామని చెప్పారు.
పశ్చిమబెంగాల్‌ను విభజించడమంటే దేశాన్ని విడదీయడమేనని, నీతి ఆయోగ్ సమావేశంలో తన వాణిని బలంగా వినిపిస్తానని, అందుకు అనుమతించ కుంటే తాను నిరసన తెలిపి సమావేశం నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని తాము బాయ్‌కాట్ చేస్తామంటూ విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు ఇప్పటికే ప్రకటించిన క్రమంలో మమత బెనర్జీ సమావేశానికి వెళ్లేందుకు సిద్ధపడటం ద్వారా సర్ప్రైజ్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. కాగా, 2024 కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బుధవారంనాడు ప్రకటించారు.
Also Read : Kargil Vijay Diwas 2024 : అగ్నిపథ్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని