CM Nitish Kumar: చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నీతీశ్ !
చెట్టుకు రాఖీ కట్టిన బీహార్ సీఎం నీతీశ్ !
CM Nitish Kumar: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతికగా నిలిచే రాఖీ పౌర్ణమి వేళ బిహార్ సీఎం నీతీశ్ కుమార్(CM Nitish Kumar) ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌధరి, విజయ్ కుమార్ శర్మతో కలిసి రాజధాని వాటికలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
CM Nitish Kumar…
బిహార్‌లో పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి రక్షా బంధన్‌ను బిహార్ వృక్ష సురక్షా దివస్ గా పాటిస్తోందని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడి పర్యావరణాన్ని సంరక్షిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ హరియాలి మిషన్ కింద మొక్కలు నాటడంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తోంది’’ అని సీఎంవో పేర్కొంది.
సోదరభావాన్ని ప్రతిబింబించే రాఖీ పండగ రోజున మన అన్నదమ్ములకు, ఇతర కుటుంబ సభ్యులకే కాదు.. పచ్చని ప్రకృతికీ రక్ష కట్టే సంప్రదాయం ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉంది. మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఈ పచ్చని తల్లిని సురక్షితంగా ఉంచుకోవడం మన కనీస ధర్మం. ఈ ఆలోచనతోనే అక్కడి ప్రజలు రాఖీ పౌర్ణమి రోజున దగ్గర్లోని అడవి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి.. చెట్లు, మహావృక్షాల కొమ్మలు, కాండాలకు రక్ష కడుతుంటారు. దీన్ని ‘జంగిల్ రక్షా బంధన్’గా పిలుస్తారు. ఈ ఆచారం 2004 నుంచే ప్రారంభమైందని, పర్యావరణ పరిరక్షణను తాము పాటించడంతో పాటు దీని ప్రాముఖ్యాన్ని ఇతర రాష్ట్రాలు, దేశాలకూ చాటిచెప్పాలన్న ముఖ్యోద్దేశంతోనే ఈ పండగను ఏటా జరుపుకొంటున్నట్లు అక్కడి ప్రజలు చెబుతారు.
Also Read : Kanaka Durga Temple : ఇంద్రకీలాద్రిపై నడుస్తున్న దుర్గమ్మ పవిత్రోత్సవాలు