CM Omar Abdullah: ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం

ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం

CM Omar Abdullah : తాను ప్రయాణించే ఇండిగో విమానాన్ని శనివారం రాత్రి జైపుర్‌కు మళ్లించడంపై అసహనం వ్యక్తం చేస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ(Delhi) విమానాశ్రయంపై సంచలన విమర్శలు చేశారు. ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించక… జైపూర్‌ లో ల్యాండ్‌ కావడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుని… పరుష పదజాలంతో తన బాధను చెప్పుకొచ్చారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

CM Omar Abdullah Slams

జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా(CM Omar Abdullah) శనివారం రాత్రి ఇండిగో విమానంలో ఢిల్లీలోకి బయలుదేరారు. అయితే ఆ సమయంలో ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతోపాటు విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో సదరు ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. దీనితో ఆ విమానం రాజస్థాన్‌ లోని జైపూర్‌ ల్యాండ్‌ అయ్యింది. దాదాపు నాలుగు గంటల తర్వాత మళ్లీ విమానం… ఢిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో విమానం ఆలస్యం కావడంపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా… తన అఫీషియల్ సోషల మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సీఎం ఒమర్‌ అబ్దుల్లా(CM Omar Abdullah) ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ… జమ్ము నుంచి ఢిల్లీ(Delhi)కి బయలుదేరిన విమానం దాదాపు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం… చివరకు జైపూర్‌లో ల్యాండ్‌ అయ్యింది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నేను విమానం మెట్లపై నిలుచుని మాట్లాడుతున్నాను. స్వచ్ఛమైన గాలిని పొందుతున్నాను. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షిట్ షో అంటూ పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల విషయంలో వీరి అలసత్వం చూస్తుంటే.. సహనం కోల్పోతున్నామని.. మర్యాదగా మాట్లాడే పరిస్థితుల్లో కూడా తాను లేనని అన్నారు.

ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం శ్రీనగర్ విమానాశ్రయంలో ఆరు విమానాలు రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినందువల్ల ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని ప్రభావం ఇతర కనెక్టింగ్‌ విమానాలపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ అసౌకర్యంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌ స్పందిస్తూ… తమ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని… జమ్మూలో భారీ వర్షాలు, వడగళ్లు కురవడం వల్ల ఈ అంతరాయం కలిగిందని తెలిపింది. వాతావరణం మెరుగైన వెంటనే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది.

ఆగిఉన్న ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన టెంపో

బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం ఆగిఉన్న ఇండిగో విమానాన్ని ట్రావెలర్‌ టెంపో ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌ మాత్రమే వాహనంలో ఉన్నాడు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ టెంపో ఆకాశ ఎయిర్ సిబ్బందిని వారి కార్యాలయం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ బే వద్దకు తీసుకురావడానికి వినియోగిస్తున్నారని తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. ఈ ప్రమాదం వల్ల పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగిందని… తర్వాత వాటిని పునరుద్ధరించామని అన్నారు.

ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆగి ఉన్న విమానాన్ని టెంపో ఢీకొట్టడంపై తమకు సమాచారం అందిందని ఈ విషయంపై జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు సమాచారం వెల్లడించినట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని… ఈ విషయంపై ఎయిర్‌లైన్స్‌ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.

Also Read : GVMC Mayor: విశాఖ మేయర్‌ పై అవిశ్వాసం నెగ్గిన కూటమి

Leave A Reply

Your Email Id will not be published!