CM Revanth Reddy: దేశానికి ఆదర్శంగా ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం – రేవంత్ రెడ్డి
దేశానికి ఆదర్శంగా ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం - రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రపంచస్థాయిలో హైదరాబాద్ కు శాశ్వత గుర్తింపు తీసుకువచ్చే విధంగా మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. దేశానికి ఆదర్శంగా… లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ ఫ్యూచర్ సిటీను నిర్మిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ అర్చకులు కల్యాణ పత్రికను సీఎంకు అందజేశారు.
CM Revanth Reddy Comment
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ… ‘రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమే. శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. నేను, భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన జరుగుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం’ అని తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం.
పేదలు సన్నబియ్యం తినే రోజులు వచ్చాయి – సీఎం రేవంత్‌రెడ్డి
శ్రీమంతుల మాదిరే పేదలు కూడా సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నాం. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… ‘‘రూ.1.90కే పేదలకు కిలో బియ్యం ఇవ్వాలని మొదట కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి భావించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2 కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్‌కార్డు దుకాణాలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ(Congress). ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు సన్నబియ్యం ఇస్తోంది. అయితే, ఉచితంగా వచ్చిన బియ్యాన్ని ప్రజలు రూ.10కి అమ్ముకుంటున్నారు. మిల్లర్లు వాటిని కొని రీసైక్లింగ్ చేసి మళ్లీ రూ.50కి అమ్ముతున్నారు. పేదల నుంచి రేషన్‌బియ్యాన్ని కొన్న మిల్లర్లు రూ. కోట్లలో దందా చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో రాష్ట్ర ప్రజలు సన్న బియ్యానికి మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టాం’’అని అన్నారు.
‘‘ ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన గత సీఎంకు ఎప్పుడూ రాలేదు. వరి వేస్తే ఉరే అని.. గత సీఎం వరి పండించనివ్వకుండా రైతులను బెదిరించారు. ఈ ప్రభుత్వం మాత్రం సన్న వడ్లపై క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తోంది. సన్నబియ్యం పథకాన్ని భవిష్యత్ లో రద్దు చేసే సాహసం ఎవరూ చేయరు. ప్రభుత్వాలు మారినా ఈ పథకం కొనసాగుతుంది. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తాం.
సన్న బియ్యం ఇస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ: ఉత్తమ్
ఏ రాష్ట్రంలోనూ రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ లేదని, తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమే ఇస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదన్న ఆయన… వీటిపై ప్రభుత్వం రూ.10,600 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. ‘‘ దొడ్డు బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ.40 ఖర్చు చేస్తోంది. అయినా ప్రజలు వాటిని తినడం లేదు. దీంతో అవి పక్కదారి పడుతున్నాయి. ఇంకొంచెం అధికధరకు కొనుగోలు చేసి సన్నబియ్యం ఇస్తున్నాం. గత ప్రభుత్వం పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేదు.ఈ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. ఆహార భద్రత చట్టాన్ని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే’’ అని ఉత్తమ్ తెలిపారు.