CM Revanth Reddy: దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి – సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి - సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ఖైరతాబాద్‌ మహాగణపతిని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి సీఎం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) తో పాటు పలువురు నాయకులు పూజలో పాల్గొన్నారు. మరోవైపు శనివారం మహాగణపతి శోభాయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌ వద్ద గణపతి నిమజ్జనాల సందడి మొదలైంది. నగరవాసులు తరలివచ్చి గణేశుడి నిమజ్జనోత్సవంలో పాల్గొంటున్నారు.

CM Revanth Reddy Key Comments on Khairatabad Ganesh

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ… ‘‘71 ఏళ్ల క్రితం గణేశ్‌ ఉత్సవ సమితి ఒకే ఒక్క అడుగు గణేశుడిని ప్రతిష్ఠించుకుని ఉత్సవాలను ప్రారంభించింది. దేశంలోనే గణేశ్‌ ఉత్సవాలకు ఖైరతాబాద్‌ ప్రసిద్ధి చెందింది. ఒక్కసారి నిర్వహణే కష్టమైన ఈరోజుల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుంటూ ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఉత్సవాలను కొనసాగిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు సీఎంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో గణేశ్‌ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందించింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఎక్కడా సమస్యలు లేకుండా ఉత్సవాలను పూర్తిచేసుకున్నాం. ఉత్సవాలను విజయవంతంగా ముగించిన గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యులను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్సవ సమితికి అన్ని విధాలుగా సహకారం అందిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy – మహా నిమజ్జనానికి సర్వం సిద్ధం

లంబోదరుడి నిమజ్జనోత్సవానికి నగరం ముస్తాబైంది. మహా నగరంలో గణేశ్ నిమజ్జనాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రూ.54 కోట్లతో నగరవ్యాప్తంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పించింది. గణేశ్ ఉత్సవ సమితులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ తోపాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో దాదాపు లక్షా 50 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా… రేపటి మహాక్రతువులో ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్‌లతో సహా దాదాపు 50 వేలకుపైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి.

ఇందుకోసం జీహెచ్ఎంసీ, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ సహా వివిధ శాఖలతో ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. 15 వేల మంది సిబ్బందితో గణేశ్ నిమజ్జనానికి సిద్ధమైన బల్దియా… 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా 11 పెద్ద క్రేన్లతో సహా 40క్రేన్‌లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుండగా… ట్యాంక్ బండ్ వైపు ఏర్పాటు చేసిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేశ్‌ నిమజ్జనం చేయనున్నారు.

నగరవ్యాప్తంగా సుమారు 303 కిలోమీటర్ల మేర ఊరేగింపుగా గణనాథులు హుస్సేన్ సాగర్‌కు తరలిరానున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ… ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది. మరోవైపు స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేలా పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. సుమారు 3 వేల మంది కార్మికులు వ్యర్థాల తొలగింపులో నిమగ్నమయ్యారు. 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అలాగే హైడ్రా, పర్యాటక శాఖల సమన్వయంతో హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశారు. పోలీసు శాఖ సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి నిమజ్జానికి తరలివచ్చే భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూసేలా ఏర్పాట్లు చేశారు.

హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జన ఏర్పాట్లను హైదరాబాద్ (Hyderabad) జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో కలిసి ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో పరిశీలించిన పొన్నం.. అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు అన్ని విభాగాలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు పొన్నం వివరించారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల శోభాయాత్రలు సాఫీగా సాగేందురు ఊరేగింపు మార్గంలో రోడ్ల మరమ్మతులు పూర్తయ్యాయని, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం వీలైనంత త్వరగా జరిగేలా చూస్తామని పొన్నం తెలిపారు.

Also Read : CM Bhagwant Mann: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్

Leave A Reply

Your Email Id will not be published!