CM Revanth Reddy: ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

 

 

సమ్మెకు సిద్ధమౌతున్న ఆర్టీసీ ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలన అప్పులపాలైన తెలంగాణాను ఇప్పుడిప్పుడే గాడీలో పెడుతున్నామని… ఇంతలోనే సమ్మె పేరుతో ఉద్యోగులు ఆందోళన చేయడం సబబు కాదని ఆయన క్లాస్ పీకారు. సోమవారం హైదరాబాద్‌ లో జీ అవార్డులు 2025 ఫంక్షన్‌ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సమరం అంటున్నారు.. ఎవరిమీద మీ సమరం ? తెలంగాణ ప్రజలపైనా?.. ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అంటూ ఆర్టీసీ కార్మికులను ఆయన సూటిగా ప్రశ్నించారు.

 

రాజకీయ పార్టీల చేతుల్లో ఉద్యోగులు పావులు కావద్దు – సీఎం రేవంత్

ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలిస్తున్నారు. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా. సమరం కాదు… సమయ స్పూర్తి కావాలి. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రండి… చర్చిందాం. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.. నన్ను కోసినా… వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు… సమయస్ఫూర్తి, సంయమనం.

 

ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు లేదా? అని ప్రశ్నించారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం అని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దు. నాతో కలిసి రండి… తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదామన్నారు.

కేవలం పదహారు నెలల్లో తమ ప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ. 30 వేల కోట్ల నగదును బదిలీ చేసిందన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి సైతం బకాయిలు పెట్టి వెళ్లిన ఘనత గత ప్రభుత్వానిదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులు నిర్మించామని చెప్పి… కాంట్రాక్టర్లకు సైతం బకాయిలు పెట్టారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి… ఇపుడు ఫామ్ హౌస్‌లో హాయిగా పడుకున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు.

 

మే 7న ఆర్టీసీ సమ్మెకు సన్నద్దతగా కవాతు

ఈ నెల 7న సమ్మెకు పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ… సమ్మె సన్నద్ధతలో భాగంగా భారీ ఎత్తున కార్మికులతో కవాతు నిర్వహించింది. ఆర్టీసీ కళాభవన్‌ నుంచి ప్రారంభమైన కవాతు… బస్‌ భవన్‌ వరకు కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసులు కూడా ఇచ్చామని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న తెలిపారు. అయినప్పటికి యాజమాన్యం చర్చలకు ఆహ్వానించకపోవడంతో సమ్మె సన్నద్ధతలో భాగంగా కవాతు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికుల కవాతు దృష్ట్యా పోలీసులను భారీగా మోహరించారు.

 

Leave A Reply

Your Email Id will not be published!