CM Revanth Reddy: సరస్వతీ నది పుష్కరస్నానమాచరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

సరస్వతీ నది పుష్కరస్నానమాచరించిన సీఎం రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు సరస్వతీనది పుష్కరస్నానమాచరించారు. అనంతరం నదీ మాతకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం ప్రారంభించారు.

CM Revanth Reddy Visit

గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు జరగనుంది. బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశంతో సరస్వతి నదికి పుష్కరాలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి 10.35 గంటలకే బృహస్పతి (గురువు) మిథున రాశిలోకి ప్రవేశించి పుష్కరకాలం ప్రారంభమవుతున్నా… గురువారం సూర్యోదయం నుంచి పుష్కర స్నానాలు ఆచరించాలని కాళేశ్వరం ఆలయ అర్చకులు వివరించారు. ఇవాళ వేకువజామున 5.44 గంటలకు సరస్వతి ఘాట్‌ వద్ద శ్రీగురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు.

సరస్వతి నవరత్న మాల హారతి

ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది. దీనితోపాటు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్‌ సిటీని నిర్మించారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. ప్రతిరోజు సగటున లక్షన్నర మంది వస్తారని దేవాదాయశాఖ అంచనా వేసింది.

Also Read : Hyderabad Metro: ప్రయాణీకులకు షాక్ ఇచ్చిన హైదరాబాద్ మెట్రో

Leave A Reply

Your Email Id will not be published!