CM Revanth Reddy: ప్రపంచ నగరాలతో పోటీపడుతూ ముందుకువెళ్తున్నాం – సీఎం రేవంత్ రెడ్డి
ప్రపంచ నగరాలతో పోటీపడుతూ ముందుకువెళ్తున్నాం - సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని చెప్పారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా (Independence Day) గోల్కొండ కోటలో జాతీయపతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ… 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తాన్ని ఏకం చేసిందన్నారు.
CM Revanth Reddy – Independence Day Celebrations
‘‘ దేశ భవిష్యత్ మనల్ని పిలుస్తోందని నెహ్రూ చేసిన ప్రసంగం చిరస్మరణీయం. నెహ్రూ స్ఫూర్తిదాయక మాటలతో దేశానికి దిశానిర్దేశం చేశారు. నాటి ప్రధాని నెహ్రూ కేవలం ప్రసంగాలతో సరిపెట్టలేదు. పటిష్ఠ భారత్ కోసం ఎన్నో చర్యలను చేపట్టారు. మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో సాగుతోంది. ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నాం. మరోవైపు పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నాం. సంక్షేమానికి కేరాఫ్ అంటే కాంగ్రెస్ పాలన. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం పథకం కేవలం ఆకలితీర్చే పథకం కాదు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీక. ప్రజాప్రభుత్వం వచ్చాకే పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రేషన్‌షాపులు పేదవాడి ఆకలితీర్చే భరోసా కేంద్రాలుగా మారాయి.
CM Revanth Reddy – రైతుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
గతేడాది ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేశాం. పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేశాం. రైతు పండించిన చివరి గింజ వరకు ధాన్యం సేకరిస్తున్నాం. ధాన్యం విక్రయించిన 48 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేశాం. రాష్ట్రంలో 78 లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రభుత్వం అండగా నిలవడంతో రైతులు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించాం.
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మన వాటా సాధించేవరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదు. మన భూములు సస్యశ్యామలం అయ్యాకే మరొకరికి నీళ్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం. నెహ్రూ నిర్మించిన సాగర్, శ్రీశైలం, శ్రీరామ్‌సాగర్‌తోనే మనకు నీళ్లు అందుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లను గోదావరిలో పోసింది. అంత డబ్బును వృథా చేసి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాల్లో మన వాటాను వదులుకోవడం జరగదు. ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఉంది. హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్‌ను మరింత ముందుకుతీసుకెళ్తాం. ఇటీవల ప్రపంచ సుందరీమణుల పోటీలకు హైదరాబాద్ వేదికైంది. పోటీలకు వచ్చిన వారికి తెలంగాణ ప్రత్యేకతలు చూపించాం. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ నిర్మాణానికి 200 ఎకరాలు కేటాయించాం. హైదరాబాద్‌లో జరిగిన బయో ఏసియా సదస్సు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక్కడి ఫార్మా కంపెనీలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి.
CM Revanth Reddy – మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ వరదకు పరిష్కారం
మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్ వరదకు పరిష్కారం చూపుతాం. హైదరాబాద్ గేట్ వేతో తెలంగాణ ముఖచిత్రాన్ని చాటిచెప్తాం. బాపూఘాట్‌ను గాంధీ సరోవర్ పేరుతో అభివృద్ధి చేస్తాం. మనకు శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ఉంది. త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్‌కు కొత్త ఎయిర్‌పోర్టులు రానున్నాయి. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో కీలక ప్రాజెక్టులు నిర్మిస్తాం. హైదరాబాద్‌ను శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా మారుస్తాం. శుభ్రమైన నగరమే లక్ష్యంగా ఏర్పాటు చేసిందే హైడ్రా వ్యవస్థ. ఆనాటి పాలకులు హిమాయత్‌సాగర్, హుస్సేన్ సాగర్‌తో వరదకు పరిష్కారం చూపారు. చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు రోడ్లపై నిలవడంతో ఇబ్బంది పడుతున్నాం. దిల్లీ , బెంగళూరు పరిస్థితి రావొద్దంటే కబ్జాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. అందుకు హైడ్రాకు అందరం సహకరించాల్సి ఉంది. రూ.30 వేల కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. కబ్జాలతో కనుమరుగైన బతుకమ్మ కుంటలను హైడ్రా పునరుద్ధరించింది.
CM Revanth Reddy – ప్రపంచానికే ఆదర్శంగా నిలుపుతాం
ప్రపంచానికే ఆదర్శంగానిలిచేలా, తెలంగాణ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ రైజింగ్-2047 పేరుతో విజినరీ డాక్యుమెంట్ ఏర్పాటు చేశాం. విజనరీ డాక్యుమెంట్ డిసెంబర్ 9న ప్రజల ముందు ఉంచుతాం. భారత్ గేమ్ ఛేంజర్‌గా హైదరాబాద్ నగరం నిలుస్తుంది. 30 ట్రిలియన్ డాలర్ ఎకానమీలో తెలంగాణ అగ్ర భాగస్వామిగా నిలుస్తుంది. జీడీపీలో ప్రస్తుతం 5 శాతం ఉన్న వాటాను 10శాతానికి పెంచుతాం. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. విశ్వ క్రీడల్లో మన ఖ్యాతి మరింత పెరగాల్సిన అవసరం ఉంది. మన యువతకు క్రీడా సదుపాయాల కోసం క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. పోలీసింగ్ వ్యవస్థలో రాష్ట్ర పోలీసులు ముందు వరుసలో నిలవడం గర్వకారణం. డ్రగ్ నియంత్రణలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలిచారు. గత ప్రభుత్వం మాకు వారసత్వంగా రూ.8.21 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిపోయింది. ఓ వైపు దానికి వడ్డీలు కడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
Also Read : Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ యోధులకు వీర్‌చక్ర పురస్కారాలు
